విరాళం కోసం శ్రుతిని డిమాండ్ చేస్తే..

కరోనా మ‌హ‌మ్మారిపై పోరులో భాగంగా ఇటు ప్ర‌భుత్వాల‌కు.. అటు బాధితుల‌కు విరాళాలు అందిస్తున్నారు సినీ ప్ర‌ముఖులు. ఫిలిం ఇండ‌స్ట్రీలో కార్మికుల కోసం కూడా సాయం అందిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఏ విరాళం ప్ర‌క‌టించ‌కుండా సైలెంటుగా ఉన్న సెల‌బ్రెటీల‌ను నెటిజ‌న్లు నిల‌దీస్తున్నారు. విరాళాలిస్తున్న వేరే వాళ్లను ఉదాహ‌ర‌ణ‌గా చూపించి తిడుతున్నారు.

ముఖ్యంగా విరాళాల విష‌యంలో వెనుక‌బ‌డి ఉన్న హీరోయిన్ల‌ను బాగా టార్గెట్ చేస్తోంది సోష‌ల్ మీడియా. సౌత్ ఇండియ‌న్ స్టార్ హీరోయిన్, క‌మ‌ల్ హాస‌న్ త‌న‌యురాలు శ్రుతి హాస‌న్‌కు కూడా ఇదే ప‌రిస్థితి ఎదురైంది. ఆమె ఇప్ప‌టిదాకా విరాళం ప్ర‌క‌టించ‌క‌పోవడంపై నెటిజ‌న్లు ఆమెను ల‌క్ష్యంగా చేసుకున్నారు. విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. దీనిపై శ్రుతి ఘాటుగా స్పందించింది. తాను విరాళం ఇవ్వాల‌నుకుంటే ఇస్తాన‌ని.. డిమాండ్ చేస్తే ఇవ్వ‌న‌ని ఆమె తేల్చి చెప్పింది.

ఈ స‌మ‌యం‌లో సమాజానికి సేవ చేయండి అని కొందరు, మీరు కూడా విరాళం ఇవ్వండి అని మరికొందరు నాకు సలహాలు ఇస్తున్నారు. నాకు సలహాలు ఇచ్చే వారందరినీ నేను ఒక్కటే అడగదలుచుకున్నాను. మీరు ఏం సేవ చేస్తున్నారు? మీరు ఎంత విరాళం ఇచ్చారు? కనీసం ప్రభుత్వం ఇంట్లోనే ఉండండి అని చెబుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అలాంటి వాళ్లా నాకు సలహాలు ఇచ్చేది? అయినా ఎవరో చెబితేగానీ విరాళం ఇవ్వాల్సిన అవ‌స‌రం నాకు లేదు. నాకు ఎప్పుడు ఇవ్వాలని అనిపిస్తుందో.. అప్పుడే ఇస్తా. దయచేసి ఉచిత సలహాలు ఇవ్వడం మానుకోండి అని తేల్చి చెప్పింది శ్రుతి.

క‌మ‌ల్ త‌న‌యురాలి మాట‌లు కొంచెం క‌ఠినంగా ఉన్నా స‌రే.. విరాళం ఇవ్వ‌డం ఇవ్వ‌క‌పోవ‌డం అన్న‌ది సెల‌బ్రెటీల ఇష్టం. దాని గురించి డిమాండ్ చేయ‌డం త‌గ‌దు. అయినా అంద‌రూ తాము చేస్తున్న సాయం గురించి బ‌య‌టికి చెప్ప‌క‌పోవ‌చ్చు. ప్ర‌చారానికి దూరంగా ఏం చేయాలో చేస్తుండొచ్చు. కాబ‌ట్టి విరాళం ప్ర‌క‌టించ‌‌ని వారిని టార్గెట్ చేయ‌డం క‌రెక్ట్ కాదు.