రీరిలీజ్ హంగామా.. ఇక్కడా అదే గోలా?

టాలీవుడ్లో చిత్రంగా ఈ మధ్య పాత సినిమాల రీరిలీజ్ హంగామా నడుస్తోంది. స్టార్ హీరోల పుట్టిన రోజులకు, ఇంకేవైనా ప్రత్యేక సందర్భాలు వచ్చినపుడు వాళ్ల బ్లాక్‌బస్టర్ సినిమాలను అభిమానుల కోసం స్పెషల్ షోలు వేయడం మామూలే. అయితే మేజర్ సిటీల్లో ఒకట్రెండు షోలకు అవి పరిమితం అయ్యేవి. కానీ ఇటీవల మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ‘పోకిరి’ సినిమాకు వందల సంఖ్యలో షోలు వేయడం.. అవన్నీ హౌస్ ఫుల్ కావడం.. కొత్త సినిమాల తరహాలో వాటికి హంగామా కనిపించం.. వసూళ్లు కూడా భారీగా రావడం చర్చనీయాంశంగా మారింది.

ఐతే మూడు వారాలు తిరిగేసరికి పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన పుట్టిన రోజు సందర్భంగా ‘జల్సా’కు అంతకుమించిన హంగామా చేశారు. ‘పోకిరి’ రికార్డులను బద్దలు కొట్టేశారు. మామూలుగా కొత్త సినిమాలకే వసూళ్లు, రికార్డుల పిచ్చి ఉంటుంది. కానీ ఇప్పుడు పాత సినిమాల విషయంలోనూ ఈ జాఢ్యం మొదలైంది.

తమ హీరోల బ్లాక్‌బస్టర్లు, కల్ట్ మూవీస్‌ను స్పెషల్ షోలుగా వేసుకుని నోస్టాల్జిక్ ఫీలింగ్ పొందడం, ఎంజాయ్ చేయడం వరకు పరిమితం కాకుండా ఇక్కడ కూడా రికార్డుల పిచ్చితో అవసరం లేని హంగామా చేస్తుండడమే అభ్యంతరకరంగా మారుతోంది. పోకిరి, జల్సా షోల తర్వాత గత నెలలో ‘చెన్నకేశవరెడ్డి’ స్పెషల్ షోలతో బాలయ్య ఫ్యాన్స్ సందడి చేశారు. ఈ షోలకు కూడా మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా అమెరికాలో ఈ సినిమాకు రికార్డు స్థాయిలో షోలు పడ్డాయి. వాటికి మంచి రెస్పాన్స్ కూడా కనిపించింది. కానీ ఈ సినిమా కలెక్షన్ల విషయంలో వివాదం నడిచింది. తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు హౌస్ ఫుల్స్ పడకపోయినా.. నిర్మాత బెల్లంకొండ సురేష్ రికార్డు స్థాయి కలెక్షన్ల లెక్క చెప్పారు. ఇవి ఫేక్ కలెక్షన్లనే విమర్శలు వచ్చాయి ఈ విషయంలో ఫ్యాన్ వార్స్ నడిచాయి.

ఇప్పుడేమో ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ‘బిల్లా’ స్పెషల్ షోలు ప్లాన్ చేశారు. కానీ ప్రభాస్ అభిమానులను వేరే హీరోల ఫ్యాన్స్ రెచ్చగొడుతుండగా.. వాళ్లు సైతం కొంచెం అతి చేస్తున్నారు. రికార్డుల విషయంలో పరస్పరం సవాళ్లు విసురుకుంటున్నారు. ఆల్రెడీ ‘రెబల్’ లాంటి డిజాస్టర్ మూవీ సినిమాకు స్పెషల్ షోలు వేయగా.. సరైన స్పందన కనిపించలేదు. దాని విషయంలో ట్రోల్ చేస్తూ ‘బిల్లా’కు సంబంధించి సవాళ్లు విసురుతున్నారు. ఎవరికి వాళ్లు ప్రశాంతంగా తమ హీరోల కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిన సినిమాలను చూసి ఎంజాయ్ చేయకుండా ఇక్కడా మళ్లీ రికార్డుల గురించి గొడవపడడం విడ్డూరం.