చిరంజీవి పెళ్లి.. అలా బీజం పడింది

తన పెళ్లి వెనుక కథను చిరంజీవి ఇప్పటికే ఒకట్రెండు సందర్భాల్లో వివరించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఇటీవల అల్లు రామలింగయ్య శత జయంతి వేడుకల్లో ప్రసంగిస్తూ తన పెళ్లి వెనుక తంతును చాలా ఆసక్తికరంగా చెప్పారు చిరు. ఐతే ఇది చిరు వెర్షన్. మరి అల్లు వారి వైపు వెర్షన్ ఏంటో తెలుసుకోవాలి కదా? ఆ కథను సురేఖ సోదరుడు, చిరంజీవి బావ అయిన అల్లు అరవింద్.. ఆలీతో జాలీగా కార్యక్రమంలో వెల్లడించారు. ఆ కథ చిరంజీవి చెప్పిన కథకు ప్రీక్వెల్ అని చెప్పొచ్చు. దాని గురించి అరవింద్ ఏమన్నారంటే…

‘‘చిరంజీవితో మా చెల్లెలి పెళ్లికి బీజం వేసింది మా అమ్మ గారు. ఒకసారి చిరంజీవి సత్యనారాయణ అనే మా బంధువును కలవడానికి మా ఇంటికి వచ్చారు. మా అమ్మే తలుపు తీసి సత్యనారాయణ పై గదిలో ఉన్నారని చెప్పింది. ఒక అరగంట మాట్లాడి వెళ్తూ మా అమ్మకు వెళ్లొస్తా అని మర్యాదగా చెప్పి వెళ్లాడు చిరంజీవి. తర్వాత సత్యనారాయణను పిలిచి ఈ అబ్బాయి చిరంజీవి కదా సినిమాల్లో చేస్తుంటాడు అని అడిగింది. అంతే కాకుండా ‘మనవాళ్లేనా’ అని వాకబు చేసింది. అతను ఔనన్నాడు. ఆ రాత్రే మా నాన్నగారితో ‘ఈ అబ్బాయి బాగున్నాడు, మంచి సినిమాలు చేస్తున్నాడు, మనవాళ్లే అంటున్నారు.. మరి మన అమ్మాయిని ఇస్తే బాగుంటుంది కదా’ అంది.

కానీ మా నాన్న గారు సినిమా వాళ్లకు మన అమ్మాయిని ఇవ్వడం ఎందుకు అంటూ తిరస్కరించారు. కానీ తర్వాత చిరంజీవితో కలిసి ఆయన మనవూరి పాండవులు సినిమా చేశారు. అప్పుడు ఆయన సీఐడీ వర్క్ మొదలుపెట్టారు. చిరంజీవికి తెలియకుండా అతడి గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు. అబ్బాయికి ఏ చెడు అలవాట్లు లేవని, అమ్మాయిల జోలికి వెళ్లడని తెలుసుకున్నారు. ఆ తర్వాత డి.వి.ఎస్.రాజు గారిని కలిసి విషయం చెప్పి సినిమా వాళ్లకు అమ్మాయిని ఇవ్వడం ఎలా అన్నట్లు నాన్న గారు మాట్లాడారు. దానికి ఆయన కోప్పడ్డారు. నువ్వు సినిమా నటుడివి, నీ కొడుకు నిర్మాత. అబ్బాయేమో మంచి వాడు, ఏ అలవాట్లూ లేవంటున్నావు. ఇంకా అతడికి అమ్మాయిని ఇవ్వడానికి ఆలోచిస్తున్నావా అన్నారు. దీంతో నాన్న గారి ఆలోచన మారిపోయింది. ఇక చిరంజీవిని అల్లుడిని చేసుకోవాలని ఫిక్సయి ఆ తర్వాత రాయబారం నడిపాం’’ అని అరవింద్ వివరించారు.