కీర్తి సురేష్ రాంగ్ బటన్స్ నొక్కింది!

హీరో డామినేటెడ్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు సోలోగా నటించేంత క్రేజ్, గుర్తింపు రావడం చాలా కష్టం. అనుష్క, నయనతార, సమంత తర్వాత కీర్తి సురేష్ కి మాత్రమే అలాంటి పేరొచ్చింది. అనుష్క, సమంత అయినా చాలా కాలం హీరోల వెనక గ్లామర్ రోల్స్ చేస్తే కానీ ఆ ఇమేజ్ రాలేదు. కీర్తి సురేష్ కి మాత్రం మహానటితో చాలా త్వరగా అంతటి గుర్తింపు వచ్చేసింది.

కాకపోతే ఆ క్రేజ్ నిలబెట్టుకోవడంలో కీర్తి రైట్ డైరెక్షన్లో వెళ్తున్నట్టు కనిపించడం లేదు. పెంగ్విన్ సినిమాలో ఎనిమిదేళ్ల పిల్లాడికి తల్లిగా నటించే రిస్క్ తీసుకుంది కానీ… అటు తనకు నటిగా కానీ, ఇటు సక్సెస్ పరంగా కానీ కలిసి వచ్చే సినిమా చేయలేకపోయింది. ఆమె నటించిన మరో రెండు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా ఓటిటిలో రిలీజ్ కాబోతున్నాయి.

మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి నిర్మాతలు ప్రస్తుతం ఓటిటి కంపెనీలతో మంచి డీల్ కోసం మాట్లాడుతున్నారని సమాచారం. హీరోయిన్ ప్రధాన సినిమాలు థియేటర్లో విడుదలయితే సదరు హీరోయిన్ కి ఉన్న క్రౌడ్ పుల్లింగ్ పవర్ తెలుస్తుంది. ఇలా ఓటిటిలో వచ్చేస్తే ఆమె ఇమేజ్ కి ఇవి పెద్దగా యాడ్ అవ్వవు. అయితే కీర్తికి ఈ సినిమాలతో లాభం జరిగినా లేకున్నా… సర్కారు వారి పాట, రంగ్ దే లాంటి కమర్షియల్ చిత్రాలు లైనప్ లో ఉండడం మాత్రం పెద్ద అడ్వాంటేజ్.