ఈ వారానికి ఈ సినిమాదే ఆధిప‌త్య‌మా?


కాంతార.. ఇప్పుడు క‌న్న‌డ‌నాట సంచ‌ల‌నం రేపుతున్న సినిమా ఇది. ఆ మాట‌కొస్తే క‌ర్ణాట‌క అవ‌త‌ల కూడా ఈ చిత్రం ప్రేక్ష‌కుల దృష్టిని బాగానే ఆక‌ర్షిస్తోంది. క‌న్న‌డ‌లోనే రిలీజై దేశంలోని మేజ‌ర్ సిటీల‌న్నింట్లో అందుబాటులో ఉన్న షోల‌తో హౌస్ ఫుల్స్‌తో ర‌న్ అవుతోంది. హైద‌రాబాద్‌లో ఈ సినిమా చూసేందుకు తెలుగు ప్రేక్ష‌కులు ఎగ‌బ‌డుతుండ‌డం చూసి ఆల‌స్యం చేయ‌కుండా అగ్ర నిర్మాత అల్లు అర‌వింద్ రంగంలోకి దిగిపోయారు. ఈ చిత్రాన్ని నిర్మించిన హోంబ‌లె ఫిలిమ్స్ భాగ‌స్వామ్యంలో తెలుగు రాష్ట్రాల్లో సినిమాను రిలీజ్ చేయ‌డానికి ముందుకు వ‌చ్చారు.

కాంతార అనే పేరుతోనే తెలుగులో ఈ శ‌నివారం ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. ఈ సంద‌ర్భంగా ట్రైలర్ కూడా లాంచ్ చేశారు. చిత్ర హీరో, ద‌ర్శ‌కుడు రిష‌బ్ శెట్టితో పాటు అల్లు అర‌వింద్ ట్రైల‌ర్ లాంచ్ కార్య‌క్ర‌మంలోనూ పాల్గొన్నారు.

ఈ వారానికి తెలుగులో చెప్పుకోగ్గ సినిమాలేవీ లేవు. బాయ్ ఫ్రెండ్ ఫ‌ర్ హైర్ లాంటి చిన్నా చిత‌కా సినిమాలే రిలీజ‌వుతున్నాయి. ద‌స‌రా సినిమాల్లో ది ఘోస్ట్, స్వాతిముత్యంల ప‌ని అయిపోయింది. గాడ్‌ఫాద‌ర్ కూడా అనుకున్నంత జోరు చూపించ‌ట్లేదు. ఈ నేప‌థ్యంలో కాంతార ఈ వారానికి బాక్సాఫీస్ విన్న‌ర్‌గా నిలిచే అవ‌కాశాలు కొట్టిపారేయ‌లేం. ఈ సినిమా గురించి జాతీయ స్థాయిలో జ‌రుగ‌తున్న చ‌ర్చ‌.. హైద‌రాబాద్, ముంబ‌యి లాంటి సిటీల్లో ఆ సినిమా ఆడుతున్న తీరు చూసి జ‌నాలు ఈ చిత్రంపై బాగానే ఆస‌క్తి చూపించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

కాంతార ట్రైల‌ర్ కూడా చాలా ఆస‌క్తిక‌రంగా అనిపించింది. క‌థాక‌థ‌నాలు చాలా ఇంటెన్స్‌గా ఉన్న‌ట్లే ఉన్నాయి. కాంతార అంటే అడ‌వి అని అర్థం. సినిమా అంతా కూడా అట‌వీ నేప‌థ్యంలోనే సాగేలా క‌నిపిస్తోంది. సినిమాలో భారీతనం, విజువ‌ల్ గ్రాండియ‌ర్, ఎఫెక్ట్స్ చూశాక దీని క‌సం మ‌న వాళ్లు ఎగ‌బ‌డితే ఆశ్చ‌ర్య‌మేమీ లేదు.