స‌ల్మాన్ వ‌ల్ల ఒరిగిందేంటి?


మెగాస్టార్ చిరంజీవి సినిమాలో క్యామియో రోల్ చేయాల‌ని అడిగితే టాలీవుడ్ టాప్ స్టార్ల‌లో ఎవ్వ‌రూ కాద‌న‌రు. స్వ‌యంగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అయినా స‌రే.. ఐదు నిమిషాలు క‌నిపించే పాత్ర‌లో క‌నిపించ‌మంటే సంతోషంగానే ఒప్పుకునేవాడేమో. కానీ గాడ్‌ఫాద‌ర్ సినిమాలో క్యామియో రోల్ కోసం ఇక్క‌డి స్టార్లెవ్వ‌రూ వ‌ద్దు అనుకుని త‌న‌కు మిత్రుడైన బాలీవుడ్ సూప‌ర్ స్టార్ స‌ల్మాన్ ఖాన్‌తో ఆ పాత్ర‌ను చేయించాడు మెగాస్టార్ చిరంజీవి.

బ‌హుశా తెలుగులో చిరుకు ఉన్న ఆక‌ర్ష‌ణ చాల‌ని, స‌ల్మాన్ ఈ రోల్ చేస్తే గాడ్‌ఫాద‌ర్ హిందీ వెర్ష‌న్‌కు ప్ల‌స్ అవుతుంద‌ని ఆశించారేమో. కానీ ఈ సినిమా పెర్ఫామెన్స్ చూస్తుంటే మాత్రం స‌ల్మాన్ వ‌ల్ల సినిమాకు పెద్ద‌గా ప్ర‌యోజ‌నం ద‌క్క‌లేద‌ని అనిపిస్తోంది.

తెలుగు వెర్ష‌న్ చూసిన వాళ్లంద‌రూ స‌ల్మాన్ క్యారెక్ట‌ర్ పెద్ద మైన‌స్ అని అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ పాత్ర‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రామ్ చ‌ర‌ణ్ లాంటి వాళ్లు చేసి ఉంటే రెస్పాన్స్, ఎలివేష‌న్ ఇంకో రేంజిలో ఉండేద‌ని చాలామంది అన్నారు. ఇక హిందీ వెర్ష‌న్ ప‌ట్ల అక్క‌డి ప్రేక్ష‌కుల్లో స‌ల్మాన్ పెద్ద‌గా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయ‌లేక‌పోయాడ‌న్న‌ది స్ప‌ష్టం. ఈ సినిమా హిందీలో ఇప్ప‌టిదాకా 6-7 కోట్ల మ‌ధ్య వ‌సూళ్లు రాబ‌ట్టిందంతే.

స‌ల్మాన్ క్యామియో చేయ‌డ‌మే కాక ఒక పాట‌లో డ్యాన్స్ కూడా చేసిన సినిమాకు ఇలాంటి రెస్సాన్స్ ఊహించ‌నిది. అక్క‌డో 20-25 కోట్ల‌యినా వ‌స్తాయ‌ని చిత్ర బృందం ఆశించిన‌ట్లుంది. థియేట్రిక‌ల్ ర‌న్లో స‌ల్మాన్ వ‌ల్ల ఇక్క‌డా, అక్క‌డా పెద్దగా ప్ర‌యోజ‌నం లేద‌ని స్ప‌ష్టంగా తెలిసిపోయింది. కాక‌పోతే ఈ చిత్రానికి శాటిలైట్, డిజిట‌ల్ హ‌క్కుల ద్వారా మాత్రం అనుకున్న‌దానికంటే ఎక్కువే వ‌చ్చింది. ఆ విష‌యంలో మాత్రం స‌ల్మాన్ ఫ్యాక్ట‌ర్ కీల‌కంగా మారింద‌న్న‌ది స్ప‌ష్టం. గాడ్‌ఫాద‌ర్‌కు స‌ల్మాన్ చేసిన సాయం అదొక్క‌టే.