లాస్ట్ ఫిలిం షో బృందంలో విషాదం

దేశమంతా ఇండియా తరఫున ఆస్కార్ నామినేషన్ గా ఆర్ఆర్ఆర్ వెళ్తుందని భావిస్తే దానికి భిన్నంగా గుజరాతి మూవీ చెల్లో షో(లాస్ట్ ఫిలిం షో) ని పంపడం గురించి ఇప్పటికీ చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అవార్డు వస్తుందా రాదానేది పక్కన పెడితే ఇప్పుడీ టీమ్ కి పెద్ద షాక్ తగిలింది. ఇందులో చైల్డ్ ఆర్టిస్ట్ గా కీలక పాత్ర పోషించిన రాహుల్ కోలి కన్నుమూశాడు. ఈ అబ్బాయి వయసు కేవలం 10 సంవత్సరాలు. తన అద్భుత పెర్ఫార్మన్స్ తో సినిమాను నిలబెట్టడం గురించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. అహ్మదాబాద్ లోని క్యాన్సర్ ఇన్స్ టిట్యూట్ లో లుకేమియాకు చికిత్స పొందుతూ చివరి శ్వాస తీసుకున్నాడు.

లాస్ట్ ఫిలిం షో ఈ నెల 14న థియేట్రికల్ రిలీజ్ కు ప్లాన్ చేశారు. 95 హాళ్లలో కేవలం 95 రూపాయల టికెట్ ధరతో స్క్రీనింగ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బిగ్ స్క్రీన్ మీద ఇందులో అంత విషయం ఏముందాని చూసేందుకు మూవీ లవర్స్ రెడీ అయ్యారు. ఈలోగా ఇంత పెద్ద విషాదం చుట్టుముట్టింది. రాహుల్ తండ్రి రిక్షా డ్రైవర్. నాలుగు నెలలుగా ట్రీట్మెంట్ లోనే ఉన్నాడు. దీని కోసం వాళ్ళ కుటుంబం ఇప్పటికే తాహతుకు మించి చాలా ఖర్చు పెట్టింది. రిక్షా అమ్మబోతే సినిమా యూనిట్ అలా జరగకుండా తగినంత ఆర్థిక సహాయం కూడా చేసింది.

కానీ చివరికి ఫలితం దక్కకుండా పోయింది. ఓ తొమ్మిదేళ్ల చిన్న కుర్రాడు పాత థియేటర్లో సినిమాలు చూసి చూసి ఫిలిం మేకర్ అవ్వాలన్న కలను ఎలా నిజం చేసుకున్నాడనేదే ఇందులో కథ. ఈ పాత్ర పోషించింది భవిన్ రాబరి. ఫ్రెండ్స్ గ్యాంగ్ లో తర్వాత హైలైట్ అయ్యేది ఇప్పుడు చనిపోయిన రాహుల్ కోలి. నలిన్ కుమార్ పాండ్య దర్శకత్వం వహించిన ది లాస్ట్ ఫిలిం షో త్వరలో తెలుగుతో పాటు ఇతర భారతీయ భాషల్లో డబ్బింగ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఆస్కార్ గెలుస్తుందో లేదో కానీ ఒక గొప్ప ఆనందాన్ని ఆస్వాదిస్తున్న సమయం లో ఇలాంటి చేదు వార్త వినాల్సి రావడం బాధే