ఒక నటుడు ఆరేడు పదుల వయసు దాటాక విశ్రాంతి కోరుకోవడం సహజం. అందులోనూ శరీరం మునుపటిలా సహకరించదు కాబట్టి ఆరోగ్యరిత్యా రిస్క్ తీసుకోకుండా రెస్ట్ కే ప్రాధాన్యమిస్తారు. అలా చేస్తే ఆయన బిగ్ బి ఎందుకవుతారు. నిర్మాతలు ఇప్పటికీ డేట్ల కోసం ఇంటి ముందు క్యూ ఎందుకు కడతారు. ఎనిమిది దశాబ్దాలకు చేరుకున్నా ఇప్పటికీ చెక్కుచెదరని చిరునవ్వుతో ఇరవై ఏళ్ళ యువకుడిలో ఉండే ఉత్సాహాన్ని చూపిస్తూ ఎందరికో మార్గదర్శిగా నిలుస్తున్న అమితాబ్ బచ్చన్ పుట్టినరోజు ఇవాళ సామాన్యులు సెలబ్రిటీలు అనే తేడా లేకుండా అందరికీ పండగలా తోస్తోంది. అమితాబ్ అనే పేరు కేవలం బాలీవుడ్ కే పరిమితం కాదు. అది అనంతం విశ్వవ్యాప్తం.
కెరీర్ ప్రారంభంలో అమితాబ్ ఒడ్డుపొడవు చూసి హీరోగా పనికిరావన్న వాళ్లే ఎక్కువ. అయినా బెదరని ఆత్మవిశ్వాసంతో ఒక్కో అడుగు ముళ్ళపరీక్ష పెట్టినా తట్టుకుని నిలబడి ఇవాళ శిఖరమంత ఎత్తున నిలబడ్డారు. 1969లో సాత్ హిందూస్థానీతో తెరంగేట్రం చేసిన బిగ్ బికి బ్రేక్ దక్కింది జంజీర్(1972)తో. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా సీరియస్ గా చూపించిన విశ్వరూపానికి బాక్సాఫీస్ దాసోహమంది. అక్కడి నుంచి వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది. షోలే(1975)గురించి చెప్పాల్సి వస్తే రోజులు కాదు నెలలు కావాలి. అది మొదలు దీవార్, కభీ కభీ, సిల్సిలా, త్రిశూల్, డాన్, మిస్టర్ నట్వర్ లాల్, లావారిస్, కాలియా ఇలా అన్నీ ఒకదాన్ని మించిన ఆల్ టైం బ్లాక్ బస్టర్లు.
1996 నుంచి అమితాబ్ అనుభవించిన పతనం బహుశా ఏ స్టార్ చూసి ఉండడు. స్వంత నిర్మాణ సంస్థలో తీసినవన్నీ డిజాస్టర్లు కావడం, బయటి నిర్మాతల సినిమాలు కోట్లలో తీవ్ర నష్టాలు తేవడం, అప్పులుపెరిగిపోవడం చూసి ఇక బిగ్ బి శకం అయిపోయిందనుకున్న టైంలో 2000లో కౌన్ బనేగా క్రోర్ పతితో ఇచ్చిన అత్యద్భుతమైన కంబ్యాక్ బహుశా చరిత్రలోనే అతి గొప్ప స్ఫూర్తి పాఠంగా చెప్పుకోవచ్చు. దాని తర్వాత 22 ఏళ్ళ తర్వాత కూడా అమితాబ్ లో ఆ ఎనర్జీ తగ్గలేదు. గుడ్ బైలో రష్మిక మందన్నకు తండ్రిగా నటించినా, సైరాలో చిరంజీవికి గురువుగా కనిపించినా, మనంలో నాగార్జున ఫ్రెండ్ గా మెప్పించినా, కెబిసి కొత్త సీజన్ లో ఆడియన్స్ ని కట్టిపడేస్తున్నా అది ఆయనకే చెల్లింది. అందుకే ఎప్పుడో నలభై ఏళ్ళ క్రితం వచ్చిన క్లాసిక్స్ ని 17 నగరాల్లో పివిఆర్ మల్టీప్లెక్సులో ప్రీమియర్లు చేస్తే ఒక్క టికెట్ ముక్క మిగల్లేదు. దటీజ్ అమితాబ్