మొత్తం లాగేస్తున్న చిరు


ద‌స‌రాకు మూడు సినిమాలు రిలీజ‌య్యాయి. అందులో అన్నింటికంటే పెద్ద సినిమా, ఎక్కువ‌గా ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షించింది గాడ్ ఫాద‌ర్ కాగా.. ది ఘోస్ట్ మంచి కంటెంట్ ఉన్న సినిమాలాగే క‌నిపించింది. స్వాతిముత్యం అనే చిన్న సినిమాకు రిలీజ్ ముంగిట పెద్ద‌గా బ‌జ్ లేక‌పోయినా.. దానికి మంచి టాక్ వ‌చ్చింది. ఐతే మెగాస్టార్ సినిమా ముందు మిగ‌తా సినిమాలు అస్స‌లు నిల‌బ‌డ‌లేక‌పోయాయి. రోజులు గ‌డిచేకొద్దీ మొత్తం ప్రేక్ష‌కుల‌ను తన వైపే తిప్పేసుకుంది చిరు సినిమా.

ది ఘోస్ట్‌కు బ్యాడ్ టాక్ రావ‌డంతో ఆరంభం నుంచే ఆ సినిమా ప‌డుకుండిపోగా.. స్వాతిముత్యం మంచి టాక్‌ను ఉప‌యోగించుకోలేక‌పోయింది. ఎంత‌కీ ఆ సినిమా వ‌సూళ్లు మెరుగుప‌డ‌లేదు. గాడ్‌ఫాద‌ర్ మూవీకి కూడా రిలీజ్ ముంగిట మ‌రీ బ‌జ్ ఏమీ లేదు కానీ.. ఆ సినిమాకు పాజిటివ్ టాక్ క‌లిసొచ్చింది. స‌గ‌టు ప్రేక్ష‌కులను ఆక‌ర్షించే అన్ని అంశాలూ ఉన్న సినిమా కావ‌డంతో ద‌స‌రాకు బాక్సాఫీస్ లీడ‌ర్ అయిపోయింది.

ఫ్యామిలీ ఆడియ‌న్స్‌ను పెద్ద ఎత్తున థియేట‌ర్ల‌కు ర‌ప్పించిన గాడ్‌ఫాద‌ర్‌.. శ‌ని, ఆదివారాల్లో హౌస్ ఫుల్స్‌తో ర‌న్ అయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేట‌ర్లు ప్రేక్ష‌కుల‌తో క‌ళ‌క‌ళ‌లాడాయి. ముఖ్యంగా వైజాగ్ స‌హా ఉత్త‌రాంధ్ర‌లో గాడ్‌ఫాద‌ర్‌కు మామూలు క్రేజ్ లేదు. అలాగే హైద‌రాబాద్‌లోనూ సినిమా మంచి వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. చిరు సినిమాకు ఉన్న డిమాండ్ చూసి ఆల్రెడీ ది ఘోస్ట్‌, స్వాతిముత్యం చిత్రాల‌కు కేటాయించిన స్క్రీన్లు, షోల‌ను కూడా క‌ట్ చేసి గాడ్‌ఫాద‌ర్‌కే ఇవ్వాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది.

మొత్తంగా చూస్తే ద‌స‌రా సంద‌డంతా చిరంజీవిదే అని చెప్పాలి. ఐదు రోజుల్లో ఈ సినిమా గ్రాస్ రూ.100 కోట్లకు చేరువ‌గా, షేర్ రూ.60 కోట్ల‌కు పైగా ఉన్న‌ట్లు అంచ‌నా. ఐతే గాడ్‌ఫాద‌ర్ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఫుల్ ర‌న్లో రూ.90 కోట్ల దాకా షేర్ రాబ‌ట్టాల్సి ఉంది. ఈ వారం చెప్పుకోద‌గ్గ సినిమాలు లేవు కాబ‌ట్టి దీపావ‌ళి వీకెండ్ వ‌ర‌కు సినిమా జోరు కొన‌సాగుతుంద‌నే ట్రేడ్ పండిట్లు అంచ‌నా వేస్తున్నారు.