మన దగ్గర అంతేగా. ఒక సినిమా పేరు చివర్లో ‘రా’ అని ఉండి, ఆ సినిమా హిట్టయిపోతే.. ఇక అందరూ టైటిల్ చివరన ‘రా’ తగిలించేశారు. ఒక హీరో ఫ్యాక్షన్ సినిమా తీసి హిట్టు కొట్టేస్తే, అందరూ ఫ్యాక్షన్ సినిమాలే మొదలెట్టేశారు. పూజా హెగ్డే చేస్తే చాలు, ఆమె గోల్డెన్ లెగ్ తో సినిమాలు హిట్టవుతాయ్ అంటూ అందరూ ఆమె వెంటే పడ్డారు. తాప్సీ ది ఐరన్ లెగ్ అంటూ ఆమెను పక్కనెట్టేశారు. అదే తరహాలో ఇప్పుడు మరో కొత్త సెంటిమెంట్ ఒకటి వినిపిస్తోంది.
వారినా హుస్సేన్. ఈ పిల్ల పేరు పెద్దగా ఎక్కడా వినుండరు. కాని ఈమె ఇప్పుడు రెండు టాలీవుడ్ బ్లాక్ బస్టర్లలో ఐటెం సాంగ్స్ చేసేసి.. ఒక సెంటిమెంటల్ ఐటెం గాళ్ గా మారిపోయింది. నిజానికి బింబిసారా మరియు గాడ్ ఫాదర్ సినిమాల్లో ఉన్న ఐటెం సాంగ్స్ అసలు ట్యూన్ పరంగా హిట్టే కాలేదు. సినిమా చూసినోళ్లకి కూడా సదరు ట్యూన్స్ ఎక్కలేదు. కాకపోతే ఆ పాటలో ఉన్న పిల్ల ఎవరో కాస్త బాగానే ఉందే అనే ఫీలింగ్ వచ్చింది. ఆ పిల్లే ఈ వారినా హుస్సేన్. సల్మాన్ ఖాన్ భావమరిది సినిమా లవ్ యాత్రీతో ఎంట్రీ ఇచ్చిన ఈ ఇరాకీ-ఆఫ్గాన్ భామ అమెరికాలో పెరిగి ఇండియాకు వచ్చిందిలే. తన అందచందాలతో భాగానే అకట్టుకుంటోంది. ఏకంగా నిన్న గాడ్ ఫాదర్ సక్సెస్ సెలబ్రేషన్స్ కు కూడా వచ్చేసింది.
ఆ మధ్యన ఎలాగైతే తెలుగు మేకర్స్ అందరూ నోరాఫతేహి వెంటపడ్డారో ఇప్పుడు వారినా హుస్సేన్ వెంట కూడా అదే తరహాలో పడుతున్నారని టాక్. మరో రెండు మూడు పెద్ద తెలుగు సినిమాల్లో ఈమె ఐటెం సాంగ్స్ చేసే ఛాన్సుండగా అమ్మడు అప్పుడే భారీ పైకం అడుగుతోందట. మరి హీరోయిన్ గా కూడా ఎవరన్నా ఛాన్సిస్తారేమో చూడాలి. అసలే సెంటిమెంట్ గా తయారైంది కాబట్టి, మనోళ్లు అలాంటి భామలను పెంచి పోషించడంలో అస్సలు లేట్ చెయ్యరుగా!