డాన్ దర్శకుడితో సూపర్ స్టార్

వయసు ఎంత మీద పడుతున్నా లెక్క చేయకుండా వేగంగా సినిమాలు చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్న సీనియర్ హీరోల్లో చిరంజీవి బాలకృష్ణ తర్వాత చెప్పుకోవాల్సింది సూపర్ స్టార్ రజనీకాంత్ గురించే. పైన ఇద్దరికీ ఆరోగ్య పరంగా తీవ్ర సమస్యలు ఎదురు కాలేదు కానీ తలైవా మాత్రం గత కొన్నేళ్లలో అమెరికా వెళ్లి మరీ చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా రోబో టైంలో తలెత్తిన హెల్త్ ఇష్యూస్ వల్ల డాక్టర్లు తీవ్ర విశ్రాంతి అవసరమని చెప్పినా సరే కుర్ర డైరెక్టర్లతో జట్టు కట్టేందుకు రజని ఉత్సాహం చూపిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం బీస్ట్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ తో జైలర్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు మరో ఫ్యాన్ బాయ్ కి దర్శకుడిగా అవకాశం ఇచ్చినట్టు చెన్నై టాక్. అతను సిబి చక్రవర్తి. ఆ మధ్య శివ కార్తికేయన్ తో డాన్ తీసింది ఇతనే. కాలేజీ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఆ యూత్ కం ఎమోషనల్ ఎంటర్ టైనర్ తమిళంలో పెద్ద హిట్టు. తెలుగులోనూ దాని బడ్జెట్ కి బిజినెస్ కి తగ్గట్టు బాగానే ఆడింది. మరో సక్సెస్ ని హీరోకి కట్టబెట్టింది. దాని టేకింగ్ చూసే తలైవా సిబి చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. గతంలో 2.0 ఇటీవలే పొన్నియన్ సెల్వన్ 1 త్వరలో ఇండియన్ 2తో రాబోతున్న లైకా ప్రొడక్షన్స్ దీన్ని నిర్మించబోతోంది. జానర్ ఏంటి, ఎంత బడ్జెట్ పెడతారనే వివరాలు ఇంకా బయటికి రాలేదు.

ఇది కాకుండా లైకాకు మరో కమిట్ మెంట్ కూడా ఇచ్చారు రజని. దాని డైరెక్టర్ ఫైనల్ కాలేదు. ప్రస్తుతం చర్చల దశలోనే ఉన్నాయి. 2.0 వల్ల తీవ్ర నష్టాలు చవి చూసిన లైకాకు ఈ రెండు ప్రాజెక్టులు కీలకం కానున్నాయి. పేట నుంచి తన అభిమానుల దర్శకత్వంలో నటించేందుకే రజని ఇష్టపడుతున్నారు. అవి తమిళంలో మంచి ఫలితాలనే ఇస్తున్నప్పటికీ ఏపి తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో ప్రతికూల వసూళ్లు తెస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు మార్కెట్ బాగా డౌన్ అయ్యింది. గత చిత్రం పెద్దన్న ఎంతో డిజాస్టరో చెప్పనక్కర్లేదు. ప్రస్తుతానికి జైలర్ మీద అంచనాలైతే బలంగానే ఉన్నాయి.