ఛాన్స్ దొరికింది.. చెలరేగిపోయాడు

తెలుగులో మంచి టాలెంట్ ఉన్న యువ న‌టుల్లో స‌త్య‌దేవ్ ఒక‌డు. ముందు చిన్న చిన్న పాత్ర‌లు చేసి.. ఆ త‌ర్వాత జ్యోతిల‌క్ష్మీ సినిమాతో హీరోగా మారిన అత‌ను.. ఎన్నో సినిమాల్లో త‌న ప్ర‌తిభ‌ను చాటుకున్నాడు. ఉమామ‌హేశ్వ‌ర‌రావు ఉగ్ర‌రూప‌స్య లాంటి సినిమాలు స‌త్యదేవ్ ఎంత మంచి న‌టుడో చాటిచెబుతాయి. ఐతే త‌న టాలెంటుకు త‌గ్గ విజ‌యాలు ద‌క్క‌క‌పోవ‌డంతో స‌త్య‌దేవ్ ఒక స్థాయికి మించి ఎద‌గ‌లేక‌పోయాడు. ఈ మ‌ధ్య‌ అత‌డి సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్ద‌గా ప్ర‌భావం చూప‌కుండానే వెళ్లిపోతున్నాయి. త‌న టాలెంటుకు త‌గ్గ సినిమాలు ప‌డ‌ట్లేద‌ని చాలామంది అత‌డి విష‌యంలో ఫీల‌వుతున్నారు. ఇలాంటి టైంలో మెగాస్టార్ చిరంజీవి సినిమా గాడ్‌ఫాద‌ర్ అత‌డి పాలిట వ‌రంలా మారింది. ఇంత పెద్ద సినిమాలో మెయిన్ విల‌న్ పాత్ర చేసే అవ‌కాశం ద‌క్కింది స‌త్య‌దేవ్‌కు.
ట్రైల‌ర్లో స‌త్య‌దేవే మెయిన్ విల‌న్ అనే సంకేతాలు ఇచ్చిన‌పుడు.. మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చింది. చిరంజీవికి విల‌న్‌గా స‌త్య‌దేవా.. మెగాస్టార్ ముందు అత‌ను నిల‌వ‌గ‌ల‌డా, త‌న స్థాయి స‌రిపోతుందా అని చాలామంది సందేహించారు. కానీ సినిమా చూసిన వాళ్లంద‌రూ ఆ అభిప్రాయాన్ని మార్చుకుంటున్నారు. ఇమేజ్ ప‌రంగా చిరును ఢీకొట్టే స్థాయి కాదు కానీ.. కేవ‌లం త‌న పెర్ఫామెన్స్‌తో మెగాస్టార్ ముందు దీటుగా నిల‌బ‌డ్డాడు స‌త్య‌దేవ్. కొన్ని సీన్ల‌లో పెర్ఫామెన్స్ ప‌రంగా చిరును అత‌ను డామినేట్ చేశాడు అంటే అతిశ‌యోక్తి కాదు. కెరీర్లో పెద్ద‌గా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌లు చేయ‌కున్నా.. ఈ సినిమాలో విల‌నీని గొప్ప‌గా పండించాడు స‌త్య‌దేవ్. స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివ‌రీ, యాక్టింగ్.. ఇలా అన్ని విషయాల్లోనూ స‌త్య‌దేవ్ త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నాడు. జై పాత్ర‌ను మ‌రో స్థాయిలో నిల‌బెట్టాడు. లేక లేక ఇలాంటి పెద్ద అవ‌కాశం వ‌స్తే రెండు చేతులా అందిపుచ్చుకున్న స‌త్యదేవ్‌కు మున్ముందు ఇలాంటి మ‌రిన్ని మంచి క్యారెక్ట‌ర్లు వ‌స్తాయ‌న‌డంలో సందేహం లేదు.