దీపావ‌ళికి ఎన్ని సినిమాలు బాబోయ్


టాలీవుడ్లో ద‌స‌రా సంద‌డి మొద‌లైపోయింది. ఈ పండ‌క్కి ఒకే రోజు మూడు సినిమాలు రిలీజ‌వుతున్నాయి. త‌ర్వాతి వారం కూడా ఈ సినిమాల సంద‌డే కొన‌సాగేలా ఉంది. చెప్పుకోద‌గ్గ సినిమాలేమీ రిలీజ్ కావ‌ట్లేదు. మళ్లీ దీపావళి ముంగిట సందడి నెలకొనబోతోంది. అక్టోబరు 21కి వరుసగా ఒక్కో సినిమా బెర్తు బుక్ చేసుకుంటోంది.

ఇప్పటికే తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ‘ప్రిన్స్’ మూవీ దీపావళికి ఫిక్సయింది. ఈ మధ్యే విశ్వక్సేన్ సినిమా ‘ఓరి దేవుడా’ను కూడా దీపావళి రేసులో నిలబెట్టిన సంగతి తెలిసిందే. ఆ త‌ర్వాత మంచు విష్ణు సినిమా జిన్నాను సైతం దీపావ‌ళి పోటీలోకి తీసుకొచ్చారు. మూడు పేరున్న సినిమాలు రిలీజ‌వుతుండ‌డంతో దీపావ‌ళికి బెర్తులు లాక్ అయిపోయిన‌ట్లే భావించారు. ఇంతకుమించి సినిమాలు వ‌స్తే థియేట‌ర్లు స‌ర్దుబాటు చేయ‌డం క‌ష్ట‌మే అవుతుంద‌ని భావించారు.

దీపావ‌ళి పోటీ అంత‌టితో ఆగడం లేదు. తాజాగా నందిని రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో సంతోష్ శోభ‌న్-మాళ‌విక నాయ‌ర్ జంట‌గా తెర‌కెక్కిన వైజ‌యంతీ మూవీస్ వారి సినిమా అన్నీ మంచి శ‌కున‌ములే కూడా దీపావ‌ళికే విడుద‌ల కాబోతోంది. ఈమేర‌కు అధికారిక ప్ర‌క‌ట‌న కూడా ఇచ్చేశారు. మ‌రోవైపు ద‌ర్శ‌కుడు తేజ ఏమో ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ ద‌గ్గుబాటి అభిరామ్ హీరోగా తాను తెర‌కెక్కించిన అహింస సినిమాను సైతం దీపావ‌ళికి విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు.

ఇవి చాల‌వ‌న్న‌ట్లు మ‌రో త‌మిళ డబ్బింగ్ సినిమా కూడా దీపావ‌ళికే విడుదల కాబోతోంది. కార్తి కొత్త చిత్రం స‌ర్దార్‌ను ఈ పండ‌క్కే రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అది తెలుగులో కూడా ఒకేసారి విడుద‌ల కావాల్సి ఉంది. మ‌రి మూడు సినిమాల‌కే థియేట‌ర్ల స‌ర్దుబాటు క‌ష్టం అంటే.. ఏకంగా అర‌డ‌జ‌ను సినిమాలు దీపావ‌ళి పోటీకి సై అంటుండ‌డంతో స్క్రీన్లు, షోలు స‌ర్దుబాటు ఎలా అన్న‌ది అర్థం కావ‌డం లేదు. ఇందులో క‌నీసం రెండ‌యినా రేసు నుంచి త‌ప్పుకోక త‌ప్ప‌దేమో.