కమెడియన్ నోటి దురుసు

టాలీవుడ్ కమెడియన్లలో మంచి టాలెంటుకు తోడు నోటి దురుసు కూడా బాగా ఉన్నవాడు రాహుల్ రామకృష్ణ. ప్రాపంచిక విషయాలపై అతడికి మంచి అవగాహన ఉన్న మాట వాస్తవమే అయినా.. తన ఫాలోవర్లను వెర్రివాళ్లను చేస్తూ అప్పుడప్పుడూ పిచ్చి ట్వీట్లు వేయడం అతడికి సరదా.

తాను ప్రధాన పాత్ర పోషించిన ‘నెట్’ అనే చెత్త సినిమా గురించి ఓ రేంజిలో ఎలివేషన్లు ఇస్తూ.. అదే టైంలో ‘టక్ జగదీష్’ సినిమాను రిలీజ్ చేస్తున్న నేచురల్ స్టార్ నానికి సవాలు విసురుతూ అతను వేసిన ట్వీట్లు అప్పట్లో చర్చనీయాంశం అయ్యాయి.

ఇతను ఇంత బిల్డప్ ఇచ్చాడంటే సినిమాలో ఏదో విశేషం ఉండే ఉంటుందని ‘నెట్’ చూసిన వాళ్లకు దిమ్మదిరిగిపోయింది. తెలుగులో వచ్చిన అత్యంత పేలవమైన సినిమాల్లో అదొకటని అర్థమై జనాలు అతణ్ని తిట్టిపోశారు. ఇక కొన్ని నెలల కిందట తాను 2022 తర్వాత సినిమాలు చేయనని, రిటైరవుతున్నానని ప్రకటించి.. అందరూ దాని గురించి బాధ పడుతుంటే తాను జోక్ చేశానంటూ ఫ్లేటు ఫిరాయించి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు.

ఇప్పుడు మహాత్మా గాంధీ పుట్టిన రోజున రాహుల్ వేసిన ఒక ట్వీట్ మరింత విమర్శలకు దారి తీసింది. తాను గాంధీజీని గొప్పవాడిగా పరిగణించట్లేదని అతను ట్వీట్ చేశాడు. ఓవైపు ఓ వర్గం అదే పనిగా గాంధీజీ గౌరవాన్ని తగ్గించేలా రకరకాల వార్తలను వండి వారుస్తున్న సమయంలో రాహుల్ చేసిన ఈ ట్వీట్ దుమారం రేపింది. నెటిజన్లు అతణ్ని గట్టిగానే టార్గెట్ చేశారు.

గాంధీ గౌరవాన్ని తగ్గించేలా వ్యాఖ్యలు చేస్తున్న వారికి రాహుల్ వ్యంగ్యంగా సమాధానం ఇచ్చాడేమో అని కొందరు అభిప్రాయపడ్డా.. మెజారిటీ జనాలకు ఈ ట్వీట్ రుచించలేదు. గాంధీజీనే అనే స్థాయా నీది, ఏం తెలుసు నీకు గాంధీ గురించి అంటూ అతడి మీద విరుచుకుపడ్డారు. దెబ్బకు రాహుల్ ఆ ట్వీట్‌ను డెలీట్ చేసేశాడు. కనీసం ఈ ట్వీట్ గురించి అతను వివరణ కూడా ఇవ్వలేదు. దీన్ని బట్టి కావాలనే నెటిజన్లను గిల్లేందుకు అతను ఈ ట్వీట్ వేశాడేమో.. ట్విట్టర్ జనాల వ్యతిరేకత చూశాక వెనక్కి తగ్గాడేమో అనిపిస్తోంది.