విక్రమ్ వేద.. గత దశాబ్ద కాలంలో తమిళంలో వచ్చిన ఉత్తమ థ్రిల్లర్ సినిమాల్లో ఒకటి. విజయ్ సేతుపతి, మాధవన్ ప్రధాన పాత్రల్లో భార్యాభర్తలైన దర్శక ద్వయం పుష్కర్-గాయత్రి రూపొందించిన చిత్రమిది. ఇందులో సేతుపతి, మాధవన్ పాత్రలను తీర్చిదిద్దిన విధానం.. వైవిధ్యమైన కథ, సరికొత్త అనుభూతిని పంచే స్క్రీన్ ప్లే సినిమాకు మేజర్ హైలైట్లుగా నిలిచాయి. ఈ చిత్రాన్ని పుష్కర్-గాయత్రిలే హిందీలో రీమేక్ చేశారు.
సేతుపతి పాత్రను హృతిక్, మాధవన్ క్యారెక్టర్ని సైఫ్ అలీ ఖాన్ చేశారక్కడ. హిందీలోనూ సేమ్ టైటిల్ కొనసాగించారు.ఈ చిత్రం శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒరిజినల్ డైరెక్టర్లే హిందీలోనూ తీయడంతో మార్పులు చేర్పులేమీ చేయలేదు. దాదాపుగా మాతృకను యాజిటీజ్ ఫాలో అయిపోయారు. హిందీలో కూడా సినిమాకు మంచి టాక్ వచ్చింది. హృతిక్, సైఫ్‌ల నటనకు ప్రశంసలు దక్కాయి. రివ్యూలు కూడా చాలా వరకు పాజిటివ్‌గానే వచ్చాయి.
ఐతే ‘విక్రమ్ వేద’కు వచ్చిన టాక్‌కు వసూళ్లకు అయితే పొంతన కుదరట్లేదు. హృతిక్ లాంటి టాప్ స్టార్ నటించిన, పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాకు ఈజీగా ఇండియాలో రూ.20 కోట్ల వసూళ్లు రావాలి. కానీ ఈ చిత్రం తొలి రోజు రూ.10 కోట్ల నెట్ వసూళ్లతో సరిపెట్టుకుంది. కొవిడ్ తర్వాత బాలీవుడ్ చిత్రాల ఓపెనింగ్స్ పడిపోయిన మాట వాస్తవమే. ఐతే అప్పుడప్పుడూ కొన్ని చిత్రాలకు మంచి ఓపెనింగ్సే వస్తున్నాయి. కొన్ని వారాల కిందటే విడుదలైన ‘బ్రహ్మాస్త్ర’కు తొలి రోజు రూ.30 కోట్లకు పైగానే కలెక్షన్లు వచ్చాయి ఇండియాలో.
అంతకుముందు ‘భూల్ భూలయియా-2’ లాంటి మీడియం సినిమాకు రూ.15 కోట్ల దాకా ఓపెనింగ్స్ వచ్చాయి. అలాంటిది హృతిక్ లాంటి టాప్ స్టార్ నటించిన సినిమాకు ఇంత తక్కువ డే-1 కలెక్షన్లు రావడం ఆశ్చర్యం కలిగించేదే. టాక్ బాగుంది కాబట్టి రెండో రోజు వసూళ్లు బాగా పుంజుకుంటాయని ఆశించారు కానీ.. శనివారం ఈ చిత్రానికి రూ.12-13 కోట్ల దాకా కలెక్షన్లు వచ్చినట్లు ట్రేడ్ పండిట్లు చెబుతున్నారు. ఈ లెక్కన సినిమా బ్రేక్ ఈవెన్ అయి హిట్ అనిపించుకోవడం చాలా కష్టంగానే కనిపిస్తోంది.