మహేశ్ బాబు ఇంట్లో చోరీకి ప్లాన్?

ప్రముఖ సినీ నటుడు కమ్ ప్రిన్స్ గా పిలుచుకునే మహేశ్ బాబు ఇంట్లో దొంగతనానికి ప్లాన్ చేసిన ఒక వ్యక్తి ఉదంతం కలకలాన్ని రేపింది. కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. జూబ్లీహిల్స్ లో మహేశ్ బాబు నివసిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇంటికి ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా పెద్ద ఎత్తున ప్రహరీగోడను నిర్మించారు.

ఇదిలా ఉంటే.. మంగళవారం రాత్రి పెద్ద శబ్ధం వచ్చినంతనే.. సెక్యురిటీ గార్డులు.. ఆ శబ్ధం వచ్చిన వైపు వెళ్లగా.. గుర్తు తెలియని ఆగంతకుడు ఒకడు తీవ్ర గాయాల పాలై పడిపోయిన విషయాన్ని గుర్తించారు. వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం అందించారు. వారు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఒడిశాకు చెందిన ఇతడ్ని క్రిష్ణగా గుర్తించారు. దొంగతనం చేసేందుకు వచ్చిన అతడు.. ఎత్తైన ప్రహరీ గోడ ఎక్కి కిందకు దూకాడు. అంచనా తప్పటంతో తీవ్ర గాయాల పాలు అయ్యాడు.

మూడు రోజుల క్రితం ఒడిశా నుంచి వచ్చిన అతను.. దొంగతనం చేసేందుకు వీలుగా సంపన్నులు ఉండే జూబ్లీహిల్స్ ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. ఇందులో భాగంగా మహేశ్ ఇంట్లో చోరీకి ప్లాన్ చేసుకున్నాడు కానీ.. అంచనాలు తప్పి తీవ్ర గాయాలై..ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన జరిగిన సమయంలో మహేశ్ బాబు ఇంట్లో లేరు. సిబ్బంది ఇచ్చిన కంప్లైంట్ తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.