నిర్మాత‌ల దెబ్బ‌కు హీరో బెంబేలు


సినీ రంగంలో అతి మంచిత‌నానికి పోతే ఎంత ప్ర‌మాద‌మో చెప్ప‌డానికి యువ క‌థానాయ‌కుడు శ్రీ విష్ణు ఉదంతాన్నే ఉదాహ‌ర‌ణ‌గా చూపిస్తున్నారు ఇండ‌స్ట్రీ జ‌నాలు. ఇండ‌స్ట్రీలో త‌మ స్థాయికి మించి పారితోష‌కాలు తీసుకుని, అద‌న‌పు ఖ‌ర్చుల రూపంలో నిర్మాత‌ల్ని బాదేసే, ప్రొడ్యూస‌ర్ పరిస్థితి అర్థం చేసుకోకుండా ముక్కుపిండి త‌మ‌కు రావాల్సిన వ‌సూలు చేసుకునే హీరోలు చాలామందే ఉన్నారు కానీ.. నిర్మాత‌ల చేతుల్లో మోస‌పోయే హీరోలు చాలా త‌క్కువ మందే. అందులో శ్రీ విష్ణు పేరు ముందు చెప్పుకోవాల్సి ఉంటుంద‌న్న‌ది ఇండస్ట్రీ వ‌ర్గాల మాట‌.

పారితోష‌కాల గురించి ప‌ట్టించుకోకుండా సినిమాలు చేస్తూ.. సినిమా బాగా ఆడితే, నిర్మాత బాగుప‌డితే చాలు అన్న మంచి ఆలోచ‌న అత‌డి కొంప ముంచిన‌ట్లుగా ఇప్పుడు ప‌రిశ్ర‌మ‌లో చ‌ర్చ జ‌రుగుతోంది. బ్రోచేవారెవ‌రురా వ‌ర‌కు అడ‌పా ద‌డ‌పా హిట్లు కొడుతూ విష్ణు ప‌రిస్థితి బాగానే ఉండేది.

ఐతే ఆ సినిమాతో కెరీర్ మ‌రో స్థాయికి వెళ్తుంద‌నుకుంటే వ‌రుస‌గా ప‌రాజ‌యాలు ప‌ల‌క‌రించాయి. దీంతో త‌ర్వాతి సినిమాల‌కు బిజినెస్ స‌రిగా జ‌ర‌గ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. శ్రీ విష్ణు సినిమాల‌కు మ‌రీ ఎక్కువ ఖ‌ర్చేమీ కాదు. ప‌రిమిత బ‌డ్జెట్లోనే సినిమాలు తీస్తారు. పేరున్న నిర్మాత‌లైతే సినిమాల‌కు స‌రిగ్గా బిజినెస్ చేసి సినిమా కొంచెం అటు ఇటు అయినా పెద్ద‌గా న‌ష్టాలు రాకుండా చూసుకునేవారు. ఐతే అత‌డితో సినిమాలు చేసిన ప్రొడ్యూస‌ర్ల వైఫ‌ల్యం వ‌ల్ల త‌న సినిమాలు ఆర్థికంగా మ‌రింత దెబ్బ తిన్నాయి. దీంతో కొన్ని సినిమాల‌కు అత‌ను పారితోష‌కం కూడా తీసుకోన‌ట్లు స‌మాచారం.

ఇక లేటెస్ట్ రిలీజ్ అల్లూరి విష‌యంలో అయితే అత‌డికి ఆదాయం తెచ్చిపెట్ట‌క‌పోగా.. చేతి నుంచి ఖ‌ర్చు పెట్టుకునేలా చేసిన‌ట్లు తెలిసింది. ఫైనాన్స్ క్లియ‌ర్ చేయ‌క‌పోవ‌డంతో సినిమాకు మార్నింగ్ షోలు ప‌డ‌లేదు. దీంతో శ్రీ విష్ణు ఆ డ‌బ్బులేవో సెటిల్ చేసి సినిమాను రిలీజ్ చేయించాడు. కానీ బ్యాడ్ టాక్, బ‌జ్ లేక‌పోవ‌డం వ‌ల్ల సినిమాకు ఓపెనింగ్స్ రాలేదు. దీంతో సెటిల్ చేసిన డ‌బ్బుల తాలూకు బాధ్య‌తంతా అత‌నే తీసుకోవాల్సి వ‌చ్చింద‌ట‌. ఈ సినిమాకు సంబంధించి విష్ణుకు రావాల్సిన రెమ్యూన‌రేష‌న్ కూడా అంద‌లేద‌ని స‌మాచారం. దీంతో ఇక‌పై పేరున్న బేన‌ర్లు, నిర్మాత‌ల‌తోనే సినిమాలు చేయాల‌ని డిసైడైన‌ట్లు సమాచారం. అత‌డి త‌ర్వాతి సినిమాలు ఏకే ఎంట‌ర్టైన్మెంట్స్, యువి క్రియేష‌న్స్, మైత్రీ మూవీ మేక‌ర్స్‌లో కావ‌డం గ‌మ‌నార్హం.