ఏజెంట్ బ్యూటీకి భలే ఆఫర్లు

హీరోయిన్ల కొరతతో అల్లాడుతున్న టాలీవుడ్ కు కొత్త బ్యూటీల అవసరం చాలా ఉంది. పూజా హెగ్డే, రష్మిక మందన్నలను స్టార్ హీరోలు వదిలి పెట్టడం లేదు. కృతి శెట్టి ఏమో వరస డిజాస్టర్లతో ఉక్కిరిబిక్కిరవుతోంది. కియారా అద్వానీ, అలియా భట్ లు బాలీవుడ్ తర్వాతే ఏదైనా అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్యాన్ ఇండియా సినిమాలకు ఈ అంశమొక్కటే పెద్ద చిక్కుగా మారింది. ఈ అవకాశం ఏజెంట్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతున్న సాక్షి వైద్యకు వరంగా మారుతోంది. అఖిల్ కు జోడిగా ఫస్ట్ మూవీనే హై లెవెల్ లో పట్టేసిన సాక్షికి ఇప్పుడు రెండో ఛాన్స్ తలుపు తట్టింది.

ఎనర్జిటిక్ స్టార్ రామ్ బోయపాటి శీను కాంబినేషన్లో రూపొందబోయే భారీ చిత్రంలో సాక్షి వైద్యనే కథానాయికగా ఎంచుకున్నట్టు లేటెస్ట్ అప్ డేట్. అఫీషియల్ గా చెప్పడానికి టైం, కొంత ప్రాసెస్ ఉంది కాబట్టి దీన్ని ఖరారుగా చెప్పలేం కానీ లాక్ చేసిన మాట వాస్తవమేనని విశ్వసనీయ వర్గాల సమాచారం. మోడలింగ్ తో కెరీర్ మొదలుపెట్టి పలు యాడ్ ఫిలింస్ లో నటించిన సాక్షి నిజానికి హిందీ మార్కెట్ కోసం ఎదురు చూసింది. అది ఆలస్యం కావడం ఈలోగా అక్కినేని వారసుడికి జోడిగా ఆఫర్ రావడం చకచకా జరిగిపోయాయి.

ఈ ప్రాజెక్టు కోసం రామ్ హెయిర్ స్టైల్ మార్చి కొత్త రూపంలోకి వెళ్ళుతున్నాడు. తన హీరోలతో ఫిజిక్స్ నే ఛాలెంజ్ చేసే యాక్షన్ ఎపిసోడ్లతో ఓ రేంజ్ లో ఎలివేషన్లు ఇచ్చే బోయపాటి ఇప్పుడు రామ్ ని ఎలా చూపిస్తాడోననే ఆసక్తి ఫ్యాన్స్ లో విపరీతంగా ఉంది. ఐస్మార్ట్ శంకర్ ఇచ్చిన మాస్ ఇమేజ్ పెంచుకునేందుకు రామ్ శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. ఈ కోవలో చేసిన రెడ్ ఆశించిన గొప్ప ఫలితాన్ని ఇవ్వలేకపోయినా డీసెంట్ గానే బయటపడింది. కానీ లింగుస్వామిని ఎక్కువ ఊహించుకుని కష్టపడిన ది వారియర్ మాత్రం దెబ్బేసింది. సో ఇప్పుడు భారమంతా బోయపాటి మీదే.