జవాన్ ఖాతాలో 250 కోట్లు

జీరో వచ్చి మూడేళ్లు దాటింది. అసలు కింగ్ షారుఖ్ ఖాన్ చివరి హిట్టు ఏదంటే వెంటనే చెప్పడం కష్టం. అంతగా ఫ్లాపులతో సతమతమవుతున్న బాద్షా క్రేజ్ విషయంలో తాను ఎప్పటికీ కింగ్ నే అని పదే పదే ఋజువు చేస్తూనే ఉన్నాడు. ఇటీవలే వచ్చిన బ్రహ్మాస్త్ర 1 వానర రూపంలో సైంటిస్ట్ గా కనిపించింది కాసేపే అయినా ఫ్యాన్స్ కి ఆ ఎపిసోడ్ మొత్తం ఓ రేంజ్ లో గూస్ బంప్స్ ఇచ్చింది. షారుఖ్ తో పాటు నాగార్జున క్యామియోలు దాని విజయంలో ఎంత కీలక పాత్ర పోషించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జనవరిలో వచ్చే పఠాన్ కోసం మూవీ లవర్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

దీని తరువాత వచ్చే మూవీగా నిర్మాణంలో ఉన్న జవాన్ ఫీవర్ ఓ రేంజ్ లో ఉందని బిజినెస్ లెక్కలు చెబుతున్నాయి. ఏరికోరి మరీ సౌత్ దర్శకుడు ఆట్లీతో చేస్తున్న ఈ మూవీ ఇంకా షూటింగ్ పూర్తి కాకుండానే శాటిలైట్ కోసం జీ5, ఆఫ్టర్ థియేటర్ ఓటిటి రైట్స్ కోసం నెట్ ఫ్లిక్స్ రెండూ కలిపి 250 కోట్లకు ఒప్పందం చేసుకున్నాయట. అసలు సినిమా బడ్జెటే ఇంత కావడం లేదని ముంబై టాక్. ఒక కమర్షియల్ మూవీకి అందులోనూ సగం మొహం కప్పేసిన పోస్టర్ తప్ప టీజర్ కూడా బయటికి రాని సినిమాకు ఇంత రేట్ పలికిందంటే ఈ కాంబినేషన్ పట్ల ట్రేడ్ లో ఉన్న నమ్మకమేంటో అర్థం చేసుకోవచ్చు.

పేరుకి జవాన్ హిందీ సినిమా అన్న మాటే కానీ మొత్తం మన దక్షిణాది ఫ్లేవర్ లోనే ఉంటుంది. హీరోయిన్ నయనతార, విలన్ విజయ్ సేతుపతి, ప్రత్యేక పాత్రలో ప్రియమణి దీన్ని బట్టే చెప్పొచ్చు రాజమౌళి తరహాలో అట్లీ మన ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకునే క్యాస్టింగ్ ని సెట్ చేసుకున్నాడని. దీపికా పదుకునే ఉంది కానీ తన క్యారెక్టర్ తాలూకు తీరుతెన్నులు ఇంకా తెలియాల్సి ఉంది. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం మీద కూడా మంచి అంచనాలున్నాయి. తెలుగుతో పాటు అన్ని ప్రధాన భాషల్లో రాబోతున్న జవాన్ 2023 జూన్ 2 విడుదల చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు. అంతా సవ్యంగా జరిగితే డేట్ లో మార్పు ఉండదు.