అక్టోబర్ 21 – మరో బిగ్ వార్

వచ్చే నెల దసరా పండగను టార్గెట్ చేసుకుని అక్టోబర్ 5 చిన్నా పెద్దా తేడా లేకుండా హీరోలు బాక్సాఫీసు యుద్ధానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. గాడ్ ఫాదర్, ది ఘోస్ట్, స్వాతిముత్యం, జిన్నాలు నువ్వా నేనా అని సవాల్ విసురుకునేందుకు రెడీ అవుతున్నారు. ఎవరైనా డ్రాప్ అవుతారా లేదానేది ఇప్పుడే చెప్పలేం కానీ ప్రస్తుతానికి ఎవరికి వారు ఆ డేట్ ని లాక్ చేసుకుని కూర్చున్నారు. తర్వాత 14న తేదీ మాత్రమే చప్పగా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్, క్రేజీ ఫెలో లాంటి బడ్జెట్ చిత్రాలు తప్ప చెప్పుకునేంత పోటీ అయితే ఏం లేదు.

కథ ఇక్కడితో అయిపోలేదు. మరో బిగ్ వార్ అక్టోబర్ 21 దీపావళి పండగ సందర్భంగా రానుంది. ఇప్పటిదాకా కన్ఫర్మ్ అయినవాటిలో విశ్వక్ సేన్ ‘ఓరి దేవుడా’ మొదటిది. మొన్నటిదాకా లేని అంచనాలు విక్టరీ వెంకటేష్ స్పెషల్ క్యారెక్టర్ చేశాడని తెలియగానే అమాంతం పెరిగిపోయాయి. అక్కడికి ఆయనే హీరో అనే రేంజ్ లో ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. అదే రోజు మాస్ మహారాజా రవితేజ ‘ధమాకా’ని రిలీజ్ చేసే ఆలోచనలో సదరు టీమ్ ఉన్నట్టు సమాచారం. త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ ఎంటర్ టైనర్ లో శ్రీలీల హీరోయిన్.

జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ తమిళ హీరో శివకార్తికేయన్ కాంబోలో రూపొందిన ‘ప్రిన్స్’ని సైతం అదే టైంకి దింపాలనే ప్లానింగ్ జరుగుతోంది. దివాలి తమిళులకూ ముఖ్యమైన పండగ కావడంతో ఆ ఛాన్స్ ని వదులుకోవడం టీమ్ కు ఇష్టం లేదు. అయితే కార్తీ నటించిన ‘సర్దార్’ని కూడా అప్పుడే రిలీజ్ చేసే దిశగా ఆల్రెడీ ప్రమోషన్లు మొదలుపెట్టారు. ఇక్కడ చెప్పిన వాటిలో ఓరి దేవుడా ఒకటే అఫీషియల్ కాగా మిగిలినవి వారం పది రోజుల్లో ఖరారవుతాయి. ఇవి మాత్రమే కాదు హాలీవుడ్ మూవీ ‘బ్లాక్ ఆడమ్’ ఆల్రెడీ 21 మీద కర్చీఫ్ వేసేసింది. దాన్ని తక్కువంచనా వేయడానికి లేదు