థియేట్రికల్ రిలీజ్.. పేరుకే

ఈ వారం మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో కృష్ణ వృంద విహారి సినిమా డీసెంట్ బజ్ తెచ్చుకుంది. ఈ సినిమాకు టాక్ కొంచెం అటు ఇటుగా ఉన్నా ఓపెనింగ్స్ కూడా పర్వాలేదు. ఇక శ్రీ విష్ణు సినిమా అల్లూరికి మార్నింగ్ షోల సందర్భంగా పెద్ద షాక్ తగిలింది. ఫైనాన్స్ క్లియరెన్స్ జరగలేదో, మరో కారణమేదైనా ఉందో తెలియదు కానీ.. మార్నింగ్ షోలు పడలేదు.

ఇక ఈ శుక్రవారం విడుదలైన మూడో సినిమా దొంగలున్నారు జాగ్రత్త గురించి అసలు ఎక్కడా చప్పుడే లేదు. ఈ సినిమా ఉన్నట్లుండి విడుదలకు సిద్ధమైంది. పెద్దగా ప్రమోట్ చేసింది లేదు. కీరవాణి చిన్న కొడుకు సింహా నటించిన సినిమా అయినా.. దీని గురించి ఆ కుటుంబంలో ఎవ్వరూ పట్టించుకోనట్లే కనిపించారు. ప్రి రిలీజ్ ఈవెంట్ హడావుడి కూడా లేదు. సింహా ఏవో కొన్ని మీడియా ఇంటర్వ్యూలు ఇవ్వడం తప్పితే అసలు పెద్దగా ప్రమోషనే లేకపోయింది. సినిమా రిలీజ్ కూడా నామమాత్రంగానే జరిగింది. చాలా తక్కువ థియేటర్లు, షోలతో సినిమాను విడుదల చేశారు. మరి ఇలా ఎందుకు చేస్తున్నారు.. సినిమా మీద నమ్మకం లేకనా అనే సందేహాలు కలుగుతున్నాయి.

ఐతే అసలు మేటర్ ఏంటంటే.. ఈ సినిమాకు ఆల్రెడీ ఓటీటీ డీల్ పూర్తయింది. అసలు నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఈ మధ్య ఓటీటీలు కూడా తెలివి మీరాయి. నేరుగా ఓటీటీలో సినిమాను రిలీజ్ చేస్తే పెద్దగా ప్రచారం ఉండట్లేదని, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేకపోతున్నామని.. మీడియా కూడా పట్టించుకోవట్లేదని.. థియేట్రికల్ రిలీజ్ ఉంటే తప్ప సినిమా గురించి ఎంత కొంత చర్చ జరగట్లేదని భావిస్తున్నాయి. అందుకే పబ్లిసిటీ కోసమే అన్నట్లు నామమాత్రంగా అయినా థియేట్రికల్ రిలీజ్ కోరుకుంటున్నాయి.

దొంగలున్నారు జాగ్రత్త మూవీని కూడా అలాగే నామమాత్రంగా థియేటర్లలోకి వదిలినట్లు కనిపిస్తోంది. దీన్నుంచి పెద్దగా ఆదాయం కూడా ఆశిస్తున్నట్లు లేరు. ఇదొక సర్వైవల్ థ్రిల్లర్. గంటన్నర నిడివితో సాగుతుంది. ఈ టైపు సినిమాలు ఓటీటీలకే బాగా సూటవుతాయి. థియేటర్లకు వచ్చి జనం చూడడం కష్టమే. దీని నిర్మాతలు కూడా థియేటర్ల నుంచి ఏమీ ఆశించకుండా మొక్కుబడిగా రిలీజ్ చేసినట్లు కనిపిస్తోంది.