ఒక సినిమా హిట్ లేదా ఫ్లాప్ కావడంలో హీరోయిన్ల పాత్ర చాలా తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే హీరోయిన్లకు మన సినిమాల్లో దక్కేవి చాలా వరకు నామమాత్రమైన గ్లామర్ రోల్సే. ఎప్పుడో కానీ హీరోయిన్లు హైలైట్ అవరు. వాళ్ల వల్ల సినిమాలు ఆడేయవు, అలాగే దెబ్బ తినవు. ఇది వాస్తవమే అయినప్పటికీ.. వరుసగా కొన్ని సినిమాలు హిట్టయితే ఆ కథానాయికను లక్కీ ఛార్మ్ అంటారు. వరుసగా సినిమాలు తేడా కొడితే ఐరెన్ లెగ్ అని ముద్ర వేసేస్తారు. కాబట్టి వారికి కూడా అడపా దడపా హిట్లు పడుతుండాలి.
హీరోయిన్ల కెరీర్ మామూలుగానే తక్కువ స్పాన్‌తో ఉంటుంది కాబట్టి.. ఆ టైంలో వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలని చూస్తారు. కానీ వరుసగా ఫెయిల్యూర్లు ఎదురైతే వారి కెరీర్ మీద ప్రతికూల ప్రభావం పడుతుంది. అవకాశాలు ఆగిపోతాయి. ఇప్పుడు కొందరు హీరోయిన్ల పరిస్థితి ఇలాగే ఇబ్బందికరంగా తయారైంది.
వరుస ఫెయిల్యూర్లతో సతమతం అవుతూ.. ఒక మంచి విజయం కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమాలు నిరాశ పరచడం ముగ్గురు హీరోయిన్లకు ఇబ్బందిగా మారింది. టాలీవుడ్లో తన కెరీర్ ప్రశ్నార్థకంగా మారిన స్థితిలో థ్యాంక్ యు మూవీ మీద చాలా ఆశలు పెట్టుకుంది రాశి ఖన్నా. ఈ సినిమా కెరీర్‌కు జీవం తెస్తుందనుకుంటే పెద్ద డిజాస్టర్ అయి ఇంకా తనను ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టింది.
ఇక తొలి సినిమా రొమాంటిక్ నిరాశ పరిచినా వరుసగా అవకాశాలు అందుకున్న కేతిక శర్మ.. రంగ రంగ వైభవంగా తనకు మంచి బ్రేక్ ఇస్తుందని అనుకుంది. ఇందులో ఆమెకు పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్ కూడా దక్కింది. ఈ సినిమాతో తొలి విజయం దక్కుతుందనుకుంటే సినిమా దారుణంగా బోల్తా కొట్టి కేతిక కెరీర్‌ను ప్రమాదంలోకి నెట్టింది.
ఇక ఉప్పెనతో ఘనంగా కెరీర్‌ను ఆరంభించాక సరైన సినిమాలు పడక ఇబ్బంది పడ్డ కృతి శెట్టి ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మీద చాలా ఆశలే పెట్టుకుంది. ఇందులో హీరోను మించి తన పాత్రకు ప్రాధాన్యం ఉండడంతో మంచి పేరుతో పాటు విజయం దక్కుతుందని కృతి ఆశించగా.. సినిమా బ్యాడ్ టాక్‌తో మొదలై డిజాస్టర్ దిశగా అడుగులేస్తోంది. ఇలా ముగ్గురు హీరోయిన్ల ఆశల్ని మూడు సినిమాలు తుంచేశాయి.