మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక

మాములుగా ఏదైనా ప్రాంతంలో వరదలు వచ్చినప్పుడు జనాన్ని దశల వారిగా హెచ్చరిస్తూ ఎప్పుడు ఖాళీ చేసి వెళ్లిపోవాలో చెబుతూ నెంబర్లతో వార్నింగ్ ఇస్తుంటారు. మూడో సంఖ్య అంటే పీక్స్ అన్నమాట. ఇక ప్రమాదం ముంచెత్తబోతోంది ప్రాణాలు కాపాడుకోమని. దీనికి హీరోయిన్ కృతి శెట్టికి లింక్ ఏంటనుకుంటున్నారా. అక్కడికే వద్దాం. ఉప్పెన డెబ్యూతోనే ఊహించని రేంజ్ లో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ అమ్మడికి తర్వాత శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు రూపంలో వరుస హిట్లు హ్యాట్రిక్ రూపంలో వరించాయి. దెబ్బకు డిమాండ్ మాములుగా పెరగలేదు.

దానికి తగ్గట్టే సహజంగానే రెమ్యునరేషన్ కూడా ఎక్కడికో వెళ్లిపోయింది. అయితే ఎంత వేగంగా మూడు సక్సెస్ లు వచ్చాయో అంత కన్నా ఫాస్ట్ గా డిజాస్టర్లు తలుపు తడుతున్నాయి. రామ్ తో ఎగిరి గంతేసి చేసిన ది వారియర్ ఏ రేంజ్ డిజాస్టరో నిర్మాతని నిద్రలో లేపి అడిగినా చెబుతాడు. రెగ్యులర్ హీరోయిన్ ఫార్మట్ లో దర్శకుడు లింగుస్వామి తనకు చేసిన మేలేమీ లేదు. సరే అది పోతే పోయింది నితిన్ తో మసాలా బొమ్మ పడిందిగా అంటూ మాచర్ల నియోజకవర్గం మీద ఆశలు పెట్టుకుంటే అదేమో రెండో వారం అడుగుపెట్టేలోపే థియేటర్ల నుంచి గుడ్ బై తీసుకుంది.

ఇప్పుడు తాజాగా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ఈ లిస్టులో జాయినయ్యింది. నిజానికి పెర్ఫార్మన్స్ పరంగా ఇప్పటిదాకా దొరికినవాటిలో ఇందులోనే ఎక్కువ స్కోప్ దొరికింది. కానీ దర్శకుడు ఇంద్రగంటి అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమవ్వడంతో ఫైనల్ గా ఇది కూడా ఫ్లాప్ దిశగానే పరుగులు పెడుతోంది. పబ్లిక్ టాక్ కానీ రివ్యూలు కానీ ఏ మాత్రం ఆశాజనకంగా లేవు. ఇప్పుడు కృతి శెట్టి ఆశలన్నీ నాగచైతన్య-వెంకట్ ప్రభు, సూర్య-బాలా కాంబోలో రాబోయే సినిమాలే మీదే ఉన్నాయి. ఇవి తీస్తున్నది రెగ్యులర్ కమర్షియల్ డైరెక్టర్లు కాకపోవడంతో పెద్ద బ్రేకే ఎక్స్ పెక్ట్ చేయొచ్చు.