ఫ్యాన్స్ కి మళ్ళీ కోపం తెప్పించారు

ఏ హీరోకైనా అభిమానులే అండాదండా అన్నీ. వాళ్ళు లేకపోతే తాము లేమని పబ్లిక్ స్టేజిల మీద స్టార్లు చెప్పే మాటలు నిజమే. అలా అని వాళ్ళను అలుసుగా తీసుకుంటే మాత్రం విమర్శలు తిట్లు తప్పవు. గాడ్ ఫాదర్ విషయంలో కొణిదెల సంస్థ అనుసరిస్తున్న ధోరణి అలాగే ఉంది. 15వ తేదీ చిరంజీవి సల్మాన్ ఖాన్ ల కాంబోలో తీసిన తార్ మార్ తక్కర్ మార్ లిరికల్ వీడియోని సాయంత్రం 7 గంటలకు రిలీజ్ చేస్తామని సోషల్ మీడియాలో నిన్నే ప్రకటించారు. సాయంత్రం దాకా మరో రెండు మూడు గంటల్లో అంటూ ఊరిస్తూ ట్వీట్లు పెట్టారు. తీరా చూస్తే ఎప్పటిలాగే ఉసూరుమనిపించారు.

ఫ్యాన్స్ భయపడినట్టే యూట్యూబ్ లో చెప్పిన టైంకి సాంగ్ వదల్లేదు. దానికి బదులు స్పాటిఫై యాప్ తాలూకు లింక్ ఇచ్చి అందులో వినమని సెలవిచ్చారు. అప్పటిదాకా కౌంట్ డౌన్ తో నిముషాలు గంటలు లెక్కబెట్టుకున్న వాళ్లకు కోపం నషాళానికి అంటింది. కామెంట్ సెక్షన్ లో తిట్ల దండకం మొదలుపెట్టారు. అసలు ఇంత పెద్ద కాన్వాస్ తో రూపొందుతున్న సినిమాకు ఆశించినంత బజ్ లేదని టెన్షన్ పడుతున్న టైంలో ఉన్న హైప్ ని చంపేసేలా ఇలా చేయడం ఏ మాత్రం పద్ధతిగా లేదని సీరియస్ గా గట్టిగానే తలంటుతున్నారు.

ఇది మొదటిసారి కాదు. కొణిదెల గత సినిమాలు ఆచార్య, సైరాలకూ ఇదే జరిగింది. సితార, యువి బ్యానర్లు ఇలాంటి పోకడతో ట్రోలింగ్ గురైనవే. ఇప్పుడు చిరు టీమ్ కు సైతం ఇది తప్పలేదు. అయినా ముందే అన్ని సిద్ధం చేసుకోకుండా ఇలా చివరి నిమిషంలో హ్యాండ్ ఇవ్వడమేటో అంతు చిక్కడం లేదు. వనరులు, టెక్నాలజీ అన్నీ చేతిలోనే ఉండగా ప్రతిసారి టెక్నికల్ గ్లిచ్ అని సింపుల్ గా తప్పించుకోవడం కరెక్ట్ కాదు. ఈ తక్కర్ మార్ డేట్, టైంలో వీలైనంత త్వరగా అనౌన్స్ చేస్తామని చావు కబురు చల్లగా చెప్పేసి జారుకోవడం ఫైనల్ ట్విస్టు.