2 రోజుల్లో 8 సినిమాలు

టాలీవుడ్ లో ఈ మధ్య ప్రతి శుక్రవారం అనావృష్టి కంటే అతివృష్టే ఎక్కువగా ఉంది. జనాలు థియేటర్లకు ఎప్పటిలాగే వస్తుండటం నిర్మాతలకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. అందుకే ఎంత పోటీ ఉన్నా సరే బాక్సాఫీస్ పోరుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే ఈ నెల 15, 16 తేదీల్లో ఏకంగా ఎనిమిది సినిమాలు నువ్వా నేనా అని తేల్చుకోబోతున్నాయి. క్రేజ్ విషయంలో అన్ని సమానం కానప్పటికీ నెంబర్ చెప్పడానికి మాత్రం ఘనంగా ఉంది. 16న విడుదల కాబోతున్న ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ మీదే వీటిలో అన్నిటి కన్నా కాసింత ఎక్కువ అంచనాలున్నాయి.

సుధీర్ బాబు కృతి శెట్టిలతో ఇంద్రగంటి చేసిన ఈ ఇండస్ట్రీ బ్యాక్ డ్రాప్ ప్రేమకథ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. హిట్టు కొట్టే తీరాలన్న లక్ష్యంతో ఉన్న కిరణ్ అబ్బవరంకు ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ సక్సెస్ కావడం చాలా ముఖ్యం. మాస్ ప్లస్ క్లాస్ ఏదో మిక్సీ చేసి కొట్టారు. ఎస్ఆర్ కళ్యాణమండపం కాంబినేషన్ కాబట్టి ఏదైనా సర్ప్రైజ్ ఉంటుందేమో చూడాలి. రెజీనా నివేదా థామస్ జంటగా చేసిన ‘శాకినీ డాకిని’ మీద బజ్ ఏమీ లేదు కానీ ఉన్నంతలో హైప్ తెచ్చేందుకు టీమ్ అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. ఓ బేబీ తర్వాత సురేష్ సంస్థ తీస్తున్న మరో విదేశీ రీమేక్ ఇది.

డబ్బింగ్ బొమ్మ ‘కె3 కోటికొక్కడు’ పబ్లిసిటీ గట్టిగానే చేస్తున్నారు. కిచ్చ సుదీప్ కి ఇక్కడ కాసింత మార్కెట్ ఉంది కాబట్టి దాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇది కన్నడలో నెలల క్రితమే వచ్చి ఒరిజినల్ వెర్షన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది. అదే రోజు బిగ్ బాస్ సన్నీ సకలగుణాభిరామ, నేను నువ్వు, అంఅఃలు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఒక రోజు ముందు 15న శింబు ‘ది లైఫ్ అఫ్ ముత్తు’ని రంగంలోకి దించుతున్నారు. వినడానికి ఇన్నేసి ఆప్షన్లు ఉన్నాయి కానీ దేనికీ స్టార్ పవర్ లేకపోవడం గమనార్హం. మౌత్ టాక్ బలంగా వస్తేనే వసూళ్లు రాబట్టుకుంటాయి. చూడాలి మరి విజేతలు ఎవరో.