వెబ్ సిరీస్‌లా.. వామ్మో అంటున్న మెగా అల్లుడు

Kalyan Dev

ఇప్పుడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా వెబ్ సిరీస్‌ల హ‌వా న‌డుస్తోంది. సినిమాలకు దీటుగా వాటికి క్రేజ్ క‌నిపిస్తోంది. వాటి మీద భారీగా పెట్టుబ‌డులు పెడ‌తున్నారు. ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ వెబ్ సిరీస్‌ల కోసం ప్ర‌త్యేకంగా బ‌డ్జెట్ కేటాయించి.. ఎప్ప‌టిక‌ప్పుడు ఒరిజిన‌ల్స్‌ను తీసుకొస్తున్నాయి.

ఐతే ఈ విష‌యంలో టాలీవుడ్ కొంచెం వెనుక‌బ‌డి ఉంద‌నే చెప్పాలి. హిందీలో మాదిరి ఇక్క‌డ వెబ్ సిరీస్‌లు ఊపందుకోలేదు. ఐతే ఈ మ‌ధ్య గాడ్, లూజ‌ర్‌, లాక్డ్, సిన్ లాంటి సిరీస్‌లు మంచి గుర్తింపే తెచ్చుకున్నాయి. చిన్న‌, మీడియం రేంజ్ హీరోల‌కు వెబ్ సిరీస్‌లు మంచి ఫ్లాట్ ఫామ్ అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. మున్ముందు స్టార్లు కూడా ఇటు వైపు చూసే అవ‌కాశాలు లేక‌పోలేదు.

ఈ నేప‌థ్యంలో మీరు కూడా వెబ్ సిరీస్‌ల్లో న‌టిస్తారా అని ఓ ఇంట‌ర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్‌దేవ్‌ను అడిగితే.. ఛాన్సే లేద‌నేశాడు. త‌న లాంటి హీరోలు వెబ్ సిరీస్‌ల్లో న‌టిస్తే క‌ష్ట‌మ‌ని అత‌న‌న్నాడు. స్టార్ హీరోలు వెబ్ సిరీస్‌లు చేస్తే ఎవ‌రూ జ‌డ్జ్ చేయ‌ర‌ని.. కానీ త‌న లాంటి కొత్త హీరోలు అవి చేస్తే.. వాటి వ‌ల్ల న‌ష్ట‌మే ఎక్కువ అని అత‌న‌న్నాడు.

తాను ఇప్ప‌టికి చేసింది ఒక్క సినిమానే అని.. ఇప్పుడు వెబ్ సిరీస్‌ల్లోకి వ‌స్తే సినిమాల్లో అవ‌కాశాలు లేక ఇటు వ‌చ్చానేమో అనే ఆలోచ‌న ప్రేక్ష‌కులకు వ‌స్తుంద‌ని క‌ళ్యాణ్ అన్నాడు. త‌న కొత్త చిత్రం సూప‌ర్ మ‌చ్చికి సంబంధించి బ్యాలెన్స్ ఉన్న పార్ట్ చిత్రీక‌ర‌ణ‌.. ఇటీవ‌లే లాక్ డౌన్ నిబంధ‌న‌లు పాటిస్తూ పూర్తి చేసిన‌ట్లు చెప్పిన క‌ళ్యాణ్.. దీని త‌ర్వాత శ్రీధ‌ర్ సీపాన ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాలో న‌టించ‌బోతున్న‌ట్లు తెలిపాడు.