ఎప్పుడో 2017లో చివరగా మహానుభావుడు రూపంలో ఓ విజయం అందుకున్నాడు యువ కథానాయకుడు శర్వానంద్. ఆ తర్వాత అతడి నుంచి వచ్చిన అరడజను సినిమాలు బోల్తా కొట్టాయి. ఎలాంటి హీరో అయినా సరే.. వరుసగా ఆరు సినిమాలు ఫెయిలయితే నిలబడడం కష్టమే అవుతుంది. శర్వా మాస్ ఇమేజ్ ఉన్న పెద్ద స్టార్ కాకపోవడంతో అతడి మార్కెట్ బాగా దెబ్బ తినేసి తన సినిమాలకు సరైన బిజినెస్ జరగని పరిస్థితి వచ్చింది.
ఇంకో ఫ్లాప్ పడితే కొత్తగా అతడితో సినిమాలు తీయాలంటే నిర్మాతలు భయపడే రోజులు ఎంతో దూరంలో లేనట్లే కనిపించాయి. ఇలాంటి టైంలో శర్వాకు అత్యావశ్యకమైన విజయాన్ని అందించింది ఒకే ఒక జీవితం. శర్వా గత సినిమాల ప్రభావం వల్ల ఈ చిత్రానికి సరైన బజ్ కనిపించలేదు విడుదలకు ముందు. తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా పెద్దగా లేవు. మార్నింగ్ షోలకు జనాలు లేక థియేటర్లు చాలా వరకు ఖాళీగా కనిపించాయి.
కానీ సినిమా చాలా బాగుందనే టాక్ బయటికి రావడంతో డే-1 మ్యాట్నీల నుంచి కథ మారిపోయింది. శని, ఆదివారాల్లో సినిమా మంచి ఆక్యుపెన్సీతో నడిచింది. సినిమా మరిన్ని రోజులు థియేటర్లలో నిలబడి మంచి వసూళ్లే సాధించేలా కనిపిస్తోంది. మొత్తానికి శర్వా కోరుకున్న విజయం ఒకే ఒక జీవితంతో వచ్చినట్లే. ఈ సినిమాతో అతడికి మరో రకమైన ఆనందం కూడా దక్కింది. ఈ చిత్రం తమిళంలో కణం పేరుతో విడుదలై అక్కడా మంచి ఫలితాన్నందుకునే దిశగా అడుగులేస్తోంది.
తమిళనాడులో కూడా సినిమా డల్లుగానే మొదలైంది. తొలి రోజు సాయంత్రానికి పుంజుకుంది. ఇప్పుడు బ్రేక్ ఈవెన్ దిశగా అడుగులు వేస్తోంది. శర్వా చాలా ఏళ్ల కిందటే జర్నీ సినిమాతో తమిళంలో సక్సెస్ అందుకున్నాడు. కానీ తర్వాత ఆ విజయాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. కొంచెం గ్యాప్ తర్వాత చేరన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తే అది విడుదలకు నోచుకోలేదు. చివరికి పే పర్ వ్యూ పద్ధతిలో రిలీజ్ చేసి మమ అనిపించారు. కానీ పెద్దగా ఫలితం లేకపోయింది. ఆ తర్వాత చాలా ఏళ్లకు ఇప్పుడు తమిళంలో సినిమా చేసి మంచి విజయాన్ని ఖాతాలో వేసుకుంటున్నాడు శర్వా.