ప్రభాస్‌తో ‘యువి’ హ్యాట్రిక్

‘బాహుబలి’తో ప్రభాస్ ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఒక్కసారిగా ఎలా పెరిగిపోయాయో తెలిసిందే. ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్‌గా అవతరించిన అతడితో వరుసగా రెండు సినిమాలు తీసే అద్భుత అవకాశం దక్కించుకుంది యువి క్రియేషన్స్. ఇది ప్రభాస్‌కు ఆల్మోస్ట్ హోం బేనర్ లాంటిదే. దీని అధినేతలు ప్రమోద్, వంశీ.. ప్రభాస్‌కు క్లోజ్ ఫ్రెండ్స్. ప్రభాస్‌తో చేసిన ‘మిర్చి’తోనే వాళ్లు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ‘బాహుబలి’ తర్వాత టాలీవుడ్ నుంచే కాక బాలీవుడ్‌ నుంచి భారీ ఆఫర్లు వచ్చినా.. అవన్నీ పక్కన పెట్టి యువి వాళ్లకే వరుసగా రెండు సినిమాలు చేశాడు ప్రభాస్.

కానీ ఏం లాభం? అతడి ఇమేజ్‌ను యువి సంస్థ ఏమాత్రం ఉపయోగించుకోలేకపోయింది. అయిన కాడికి బడ్జెట్లయితే పెట్టి ‘సాహో’, ‘రాధేశ్యామ్’ సినిమాలు నిర్మించింది కానీ.. వాటిలో సరైన విషయం ఉందా లేదా అని సరి చూసుకోలేకపోయింది. దీంతో ఆ రెండు సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లయ్యాయి. దీంతో యువి క్రియేషన్స్ అంటేనే ప్రభాస్ అభిమానుల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. సాహో, రాధేశ్యామ్ సినిమాలకు సమాయనుకూలంగా అప్‌డేట్స్ ఇవ్వకపోవడం, ప్రమోషన్లు సరిగా చేయకపోవడం కూడా వారి ఆగ్రహానికి కారణం.

అందుకే యువి వాళ్లతో మళ్లీ సినిమా తీయొద్దని ప్రభాస్‌కు సూచిస్తుంటారు అభిమానులు. ఐతే వరుసగా ప్రభాస్ మూడో చిత్రం కూడా యువి క్రియేషన్స్ చేతికే వెళ్తుండటం గమనార్హం. ప్రభాస్ నెక్స్ట్ రిలీజ్ ‘ఆదిపురుష్’ అన్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతికి షెడ్యూల్ అయిన ఈ మైథలాజికల్ విజువల్ వండర్ తెలుగు హక్కులను యువి వాళ్లే సొంతం చేసుకున్నారట. రూ.100 కోట్లు పెట్టి హక్కులు కొన్నట్లు సమాచారం.

ప్రభాస్ గత రెండు చిత్రాలతో పోలిస్తే ఈ రేటు తక్కువ అనే చెప్పాలి. ఐతే ఎంతైనా ‘ఆదిపురుష్’ బాలీవుడ్ మూవీ. అక్కడి నిర్మాతలు వచ్చి తెలుగులో ప్రమోషన్, బిజినెస్ చూసుకోవడం కంటే.. ఇక్కడ మంచి నెట్ వర్క్ ఉన్న యువి వాళ్లకు సినిమాను గుంపగుత్తగా ఇచ్చేయడం మంచిదని ఫీలైనట్లున్నారు. ప్రభాస్ రికమండేషన్ కూడా వర్కవుటై సినిమా కాస్త తక్కువ రేటుకే వాళ్ల సొంతమైనట్లుంది. సినిమాకు మంచి టాక్ వస్తే రికవరీ పెద్ద కష్టమేమీ కాదు. మంచి లాభాలు అందుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. మరి ఈ రకంగా అయినా ప్రభాస్‌తో యువి వాళ్లు మంచి హిట్ కొడతారేమో చూడాలి.