ఆచార్య డిజాస్టర్.. చిరు ఫస్ట్ రియాక్షన్

ఆచార్య సినిమా రిలీజ్ తర్వాత ఎంత ట్రోలింగ్ జరిగిందో రిజల్ట్ ఏమైందో అందరికీ తెలిసిందే. మెగా స్టార్ కి ఉన్న ఇమేజ్ ను అరాకొరా కలెక్షన్స్ తో ఆ సినిమా బాగా డ్యామేజ్ చేసిపారేసింది. అయితే ఆచార్య రిజల్ట్ గురించి అందరూ ఎంత మాట్లాడినా చిరు ఎప్పుడూ రిజల్ట్ పై రెస్పాండ్ అవ్వలేదు. కానీ మొదటి సారి ఓ సినిమా ఈవెంట్ లో ఆ సినిమా రిజల్ట్ గురించి వేదికపై మాట్లాడి తన మీద తనే పంచ్ వేసుకున్నారు చిరు.

తాజాగా పూర్ణోదయ బేనర్ పై శ్రీజ నిర్మాతగా మారి నిర్మించిన ఫస్ట్ డే ఫస్ట్ షో అనే చిన్న సినిమా ఈవెంట్ కి గెస్ట్ గా హాజరయ్యాడు మెగాస్టార్. పూర్ణోదయ సంస్థ తో తనకి ఉన్న బంధాన్ని అలాగే నిర్మాత ఏడిద నాగశ్వరరావు గారితో తమకి ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. స్పీచ్ చివర్లో ప్రస్తుత సినిమాల విజయాల గురించి మాట్లాడుతూ కంటెంట్ బాగుంటే సినిమాలు ఆడతాయని గట్టిగా చెప్పగలను.. అందుకే బింబిసార, సీత రామం, కార్తికేయ 2 సినిమాల విజయాలే ఉదాహరణ అంటూ చెప్పారు చిరు.

ఇక కంటెంట్ బాగోక పోతే మాత్రం ఆడియన్స్ సినిమా చూడరని అందులో నేను కూడా ఓ బాధితుడినే అని ఆచార్య రిజల్ట్ గుర్తు చేసుకొని వేదికపై ఆత్మ విమర్శ చేసుకున్నారు చిరు. అంతే కాదు దర్శకులు మంచి కంటెంట్ సినిమాలు తీయాల్సిన బాధ్యత ఉందని అంటూ ఇన్ డైరెక్ట్ గా కొరటాల పై ఓ పంచ్ కూడా వేశారు. ఇదే వేదిక మీద తను నెల్లూరులో ఫస్ట్ డే ఫస్ట్ షో చూసిన ఎన్టీయార్ ‘ రాము’ సినిమాను నెమరు వేసుకున్నారు చిరు.

ఆ రోజు తన తమ్ముడు నాగబాబు ని తీసుకొని ఆ సినిమా జనాల్లో నేల టికెట్టు కి చూశానని ఆ తర్వాత తన తండ్రి ఇంటికెళ్లాక చితకబాదారని వాపోయాడు చిరు. అది ఎప్పటికీ మర్చిపోలేని సంఘటన అని ఆ టైమ్ లో నాగబాబు కి ఏమైనా అయితే ఎంటి పరిస్థితి అని నాన్న ప్రశ్నకి తన దగ్గర సమాధానం లేదని చెప్పారు మెగాస్టార్. అలాగే పనిలో పనిగా తన శ్రీమతి సురేఖను కొందరు చిట్టి అని ముద్దు పేరుతో పిలుస్తారని, అప్పుడప్పుడు జాతిరత్నాలు సినిమాలో చిట్టి పాట తో తనని సరదాగా ఆట పట్టిస్తానని అన్నారు. ఏదేమైనా ఫర్ ది ఫస్ట్ చిరు తన లేటెస్ట్ డిజాస్టర్ ఆచార్య గురించి మాట్లాడటం హాట్ టాపిక్ అవుతుంది.