విజ‌య్‌ని తిట్టి.. సారీ చెప్పిన పెద్దాయ‌న‌

ఈ మ‌ధ్య అదే ప‌నిగా బాలీవుడ్ సినిమాల‌ను టార్గెట్ చేస్తూ బాయ్‌కాట్‌కు పిలుపునిస్తున్న వ్య‌క్తుల గురించి త‌న కొత్త చిత్రం లైగ‌ర్ ప్ర‌మోష‌న్ల సంద‌ర్భంగా విజ‌య్ దేవ‌ర‌కొండ చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశం అయిన సంగ‌తి తెలిసిందే. బాయ్‌కాట్ చేస్తే చేయ‌నివ్వండి.. ఏమ‌వుతుంది.. చూసేవాళ్లు ఎలా అయినా చూస్తారు అన్న‌ట్లు మాట్లాడాడు అత‌ను. చాలామంది విజ‌య్ వ్యాఖ్య‌ల్లో త‌ప్పేమీ లేద‌ని అభిప్రాయ‌ప‌డ‌గా.. అన‌వ‌స‌రంగా బాయ్‌కాట్ బ్యాచ్‌ను కెలికి సినిమాకు చెడు చేసుకున్నాడ‌నే అభిప్రాయం కొంద‌రి నుంచి వ్య‌క్త‌మైంది.

ఈ నేప‌థ్యంలోనే ముంబ‌యికి చెందిన ప్ర‌ముఖ ఎగ్జిబిట‌ర్, డిస్ట్రిబ్యూట‌ర్ మ‌నోజ్ దేశాయ్.. విజ‌య్ మీద మండిప‌డ్డాడు. విజ‌య్ యాటిట్యూడ్, యారొగెన్స్ వ‌ల్ల లైగ‌ర్ సినిమాకు బుకింగ్స్ లేవ‌ని,  ఇంత అతి ప‌నికి రాద‌ని, విజ‌య్ కావాల‌నుకుంటే త‌న సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసుకోవాలని ఆయ‌న విమ‌ర్శించాడు.

క‌ట్ చేస్తే రెండు రోజుల త‌ర్వాత విజ‌య్ నేరుగా వెళ్లి మ‌నోజ్ దేశాయ్‌ను క‌లిశాడు. వాస్త‌వంగా అస‌లేం జ‌రిగింది వివ‌రించాడు. త‌న వ్యాఖ్య‌ల వెనుక ఆంత‌ర్యం చెప్పాడు. అలాగే త‌న వ్యాఖ్య‌లు బాధ పెట్టి ఉంటే క్ష‌మించాల‌ని అడ‌గ‌డ‌మే కాక మ‌నోజ్ కాళ్ల మీద ప‌డి ఆశీర్వాదం కూడా తీసుకున్నాడు.

ఈ సంద‌ర్భంగా మ‌నోజ్ దేశాయ్.. తిరిగి విజ‌య్‌కి సారీ చెప్ప‌డం విశేషం. విజ‌య్ వ్యాఖ్య‌ల‌కు సంబంధించి చిన్న బిట్‌ను మాత్ర‌మే ఎవ‌రో త‌న‌కు ఫార్వ‌ర్డ్ చేశార‌ని.. అది చూసి అత‌ణ్ని త‌ప్పుగా అర్థం చేసుకున్నాన‌ని.. నిజానికి అత‌డి వ్యాఖ్య‌ల్లో త‌ప్పేమీ లేద‌ని.. విజయ్ స్వ‌యంగా వ‌చ్చి త‌న‌కు వివ‌రించ‌డంతో త‌నెలాంటి వాడో అర్థ‌మైంద‌ని అన్నాడు మ‌నోజ్. లైగ‌ర్ సినిమా హిందీలో మంచి వ‌సూళ్లు సాధిస్తున్న‌ట్లు కూడా  ఆయ‌న తెలిపాడు. విజ‌య్ మంచి స్థాయికి వెళ్లాల‌ని అభిల‌షిస్తూ అత‌డిని మ‌నోజ్ ఆశీర్వ‌దించి పంప‌డంతో క‌థ సుఖాంతం అయింది.