ఇంత సైలెన్స్ ఎందుకు లైగర్?

సినిమాలన్నాక హిట్లు ఫ్లాపులు డిజాస్టర్లు సహజం. ఇది అందరు హీరోలు చూసిందే. స్వర్గీయ ఎన్టీఆర్ తో మొదలుపెట్టి ఇప్పటి లేలేత వైష్ణవ్ తేజ్ దాకా ప్రతి ఒక్కరికి అనుభవమే. ఎవరూ తప్పించుకోలేరు. కాకపోతే టాక్ ఎలా ఉన్నా మొదటి వారం నిజమో అబద్దమో ఎంతో కొంత హడావిడి చేస్తూ ఉంటేనే కలెక్షన్లు మరీ దిగజారిపోకుండా ఉంటాయి. అందుకే రిజల్ట్ తో సంబంధం లేకుండా రిలీజ్ రోజు సాయంత్రం టపాకాయలు కాల్చడం, సక్సెస్ ప్రెస్ మీట్లు పెట్టడం, కలెక్షన్ పోస్టర్లు పాజిటివ్ గా వచ్చిన రివ్యూలు, పబ్లిక్ రెస్పాన్స్ వీడియోలను ట్వీట్లు చేసుకోవడం అందరు చేసేదే.

కానీ లైగర్ రిలీజై ఇరవై నాలుగు గంటలు దాటిపోయినా విజయ్ దేవరకొండ అఫీషియల్ హ్యాండిల్ నుంచి ఒక్క ట్వీట్ లేదు. ఆఖరిగా నాని విష్ చేసింది మాత్రమే కనిపిస్తోంది. ఆ తర్వాత ఎలాంటి చప్పుడు లేదు. అంటే రౌడీ హీరో పరాజయాన్ని ఒప్పుకున్నట్టా లేక నిజం గ్రహించి వాస్తవాలు దాచిపెట్టి హిట్ అని చెప్పుకోవడం ఎందుకని ఆగినట్టాని నెటిజెన్లు రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఛార్మీ సైతం కొన్ని రీ ట్వీట్లు చేస్తోంది తప్ప వ్యక్తిగతంగా తన వైపు నుంచి పర్సనల్ గా ఎలాంటి థాంక్స్ కానీ మెసేజులు కానీ పెట్టలేదు.

ఇక పూరి జగన్ సంగతి సరేసరి. ఎప్పుడో 2021 జనవరిలో కెజిఎఫ్ గురించి పెట్టిన ట్వీట్ తప్ప ఆ తర్వాత ఇంకేమీ లేవు. కనీసం తన మొదటి ప్యాన్ ఇండియా మూవీ కోసమైనా యాక్టివ్ కాలేదు. సరే తనంటే సోషల్ మీడియా వద్దనుకున్నాడు ఒకే. మరి పైన చెప్పిన ఇద్దరూ మౌనంగా ఉండటమే కొత్త ప్రశ్నలను తలెత్తేలా చేస్తోంది. పెద్దమ్మ గుడికి వెళ్లి టీమ్ మొత్తం ఆశీర్వాదాలు తీసుకుంది. స్పెషల్ ప్రీమియర్లతో మొదలైన హిందీ వెర్షన్ కు సైతం ఇదే స్పందన రావడంతో లైగర్ పరిస్థితి అగమ్యగోచరమే.