దేశం గర్వించదగ్గ నటుల్లో మోహన్ లాల్ ఒకరు. ఆయన్ని భాషలకు అతీతంగా కోట్లాదిమంది అభిమానిస్తారు. మలయాళం అర్థం చేసుకోవడం చాలా కష్టం అయినా సరే.. ఇతర భాషల వాళ్లు కేవలం మోహన్ లాల్ నటన కోసం ఆయన సినిమాలను చూస్తారు. వాళ్లను తన సమ్మోహన నటనా శక్తితో కట్టిపడేసి ఎంటర్టైన్ చేయడం మోహన్ లాల్‌కే చెల్లు.
ఆయన తెలుగులో ‘మనమంతా’ చిత్రంలో లీడ్ రోల్ చేయడంతో పాటు ‘జనతా గ్యారేజ్’ కీలక పాత్ర చేసి తెలుగు ప్రేక్షకులకు నేరుగా తన టాలెంట్ ఏంటో చూపించారు. ‘పులి మురుగన్’ సహా కొన్ని డబ్బింగ్ సినిమాలూ ఆయన్ని తెలుగు ప్రేక్షకులకు చేరువ చేశాయి. కాగా కొంచెం గ్యాప్ తర్వాత మళ్లీ ఆయన తెలుగులో డైరెక్ట్ సినిమా చేయబోతున్నారు. ఆ సినిమాకు ‘వృషభ’ అనే టైటిల్ కూడా ఖరారైంది. తెలుగుతో పాటు మలయాళంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది.
విశేషం ఏంటంటే.. ‘వృషభ’ చిత్రాన్ని రూపొందించబోయేది ఒక కన్నడ దర్శకుడు. అతడి పేరు.. నందకిషోర్. ఈ చిత్రంలో ఒక ప్రముఖ తెలుగు కథానాయకుడు కూడా నటిస్తాడట. ఒక రకంగా చెప్పాలంటే ఇది ‘జనతా గ్యారేజ్’ తరహా మల్టీస్టారర్ అని చెప్పొచ్చు. ఒక కన్నడ దర్శకుడు మలయాళ, తెలుగు హీరోలతో తెలుగు, మలయాళ భాషల్లో మల్టీస్టారర్ తీయడం విశేషమే. ఈ చిత్రాన్ని అభిషేక్ వ్యాస్, ప్రవీర్ సింగ్, శ్యామ్ సుందర్ కలిసి నిర్మించనున్నారు.
బేసిగ్గా తెలుగు, మలయాళ చిత్రాల్లో తెరకెక్కినప్పటికీ.. పలు భాషల్లో దీన్ని రిలీజ్ చేస్తారట. 60 ప్లస్ వయసులో ఉన్న మోహన్ లాల్.. సినిమాలు చేయడంలో చూపించే వేగం, ఆయన ఎంచుకునే సబ్జెక్టులు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఏడాదికి మూణ్నాలుగు రిలీజ్‌లు ఉంటాయి. ప్రతి సినిమాలోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇమేజ్ గురించి పట్టించుకోకుండా ఎలాంటి పాత్రనైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఈ లక్షణాలే మిగతా స్టార్ హీరోలందరికీ ఆయన్ని భిన్నంగా నిలుపుతుంది.