టాలీవుడ్‌కు ఓటీటీల రివర్స్ పంచ్

కొవిడ్ పుణ్యమా అని ఇండియాలో ఓటీటీల హవా బాగా పెరిగిపోయింది. తెలుగులో కూడా ఓటీటీల జోరు మామూలుగా లేదు. ఐతే ఇవి ఫిలిం ఇండస్ట్రీకి మేలు చేశాయా, చెడు చేశాయా అంటే చెప్పడం కష్టమే. కరోనా టైంలో థియేటర్లు మూతపడగా, ఓటీటీలో కొత్త సినిమాలను కొని రిలీజ్ చేశాయి. ఆ రకంగా నిర్మాతలకు ఆదాయాన్ని అందించాయి. ప్రేక్షకులకు కూడా వినోదానికి ఢోకా లేకపోయింది. కానీ ఆడియన్స్ వాటికి బాగా అలవాటు పడిపోయి థియేటర్లకు రావడం తగ్గించేయడంతో నిర్మాతల ప్రధాన ఆదాయ వనరు మీద ప్రతికూల ప్రభావం పడింది.

కొత్త సినిమాలను నేరుగా, లేదంటే థియేటర్లలో రిలీజైన రెండు మూడు వారాలకే ఓటీటీల్లో రిలీజ్ చేసేస్తుండడం మున్ముందు ఇండస్ట్రీని మరింత ప్రమాదంలోకి నెడుతుందనే చర్చ ఇటీవల బాగా నడిచింది. ఈ నేపథ్యంలోనే కొత్త సినిమాలు థియేటర్లలో రిలీజైన 50 రోజుల తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేయాలనే తీర్మానం జరిగింది టాలీవుడ్లో.

ఐతే అంత ఆలస్యం చేస్తే ఓటీటీలు డిజిటల్ హక్కుల విషయంలో కచ్చితంగా రేటు తగ్గిస్తాయనే అంచనా ముందు నుంచే ఉంది. ఈ విషయంలో ఓటీటీలన్నీ కలిపి ఓ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సినిమాకు ఇంత రేటు అని కాకుండా అది స్ట్రీమ్ అయ్యే సమయాన్ని బట్టి ధర చెల్లించాలని నిర్ణయిచాయట. ఒక గంట స్ట్రీమింగ్ సమయానికి 3 రూపాయలు చెల్లిస్తారట. ఇలా ఎన్ని గంటల సమయం స్ట్రీమ్ అయితే అన్ని 3 రూపాయలు జమ అవుతుంది.

10 లక్షల మంది రెండు గంటల సినిమాను పూర్తిగా చూస్తే రూ.60 లక్షలు చెల్లిస్తారన్నమాట. చిన్న, మీడియం రేంజ్ సినిమాలకు ఈ మేరకు రేట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. పెద్ద సినిమాలకు ఇలా కాకుండా సినిమాకు ఇంత అనే రేటు ఇవ్వొచ్చు. కానీ థియేట్రికల్ రిలీజ్‌కు, ఓటీటీ విడుదలకు గ్యాప్ ఎక్కువ ఉంటోంది కాబట్టి ఇంతకుముందు ఇచ్చే ధరలైతే ఉండవు. కచ్చితంగా రేటు తగ్గుతుంది. ఇది కచ్చితంగా టాలీవుడ్‌కు షాకే. మరి నిర్ణయంపై టాలీవుడ్ నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి.