ఒక సినిమా.. మూడో టైటిల్

ఒక సినిమాకు అనివార్య కారణాలతో ఒకసారి టైటిల్ మార్చిన ఉదంతాలు చాలానే కనిపిస్తాయి. తెలుగులో అర్జున్ సురవరం, గద్దలకొండ గణేష్ లాంటి చిత్రాలకు చివరి దశలో టైటిళ్లు మారిన సంగతి తెలిసిందే. హిందీలో కూడా కొన్ని సినిమాలకు ఇలా జరిగింది. కానీ ఇప్పుడో సినిమాకు మూడోసారి టైటిల్ మారడం విశేషం. ఆ సినిమా సల్మాన్ ఖాన్ లాంటి సూపర్ స్టార్‌ది కావడం గమనార్హం.

గతంలో రచయితగా పని చేసి, ఆ తర్వాత దర్శకుడిగా మారి ఎంటర్టైన్మెంట్, హౌస్ ఫుల్-3, హౌస్ ఫుల్-4, బచ్చన్ పాండే లాంటి చిత్రాలను రూపొందించిన ఫర్హద్ సాంజి దర్శకత్వంలో సల్మాన్ ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ముందు ‘కభీ ఈద్ కభీ దివాళి’ అనే టైటిల్ పెట్టారు. ఐతే దేశంలో మతానికి సంబంధించిన వ్యవహారాలు మరీ సున్నితంగా మారిపోయిన నేపథ్యంలో ఈ టైటిల్ వల్ల హిందు, ముస్లింల మధ్య లేని వివాదాన్ని సృష్టించినట్లు అవుతుందేమో అని ఆ టైటిల్‌పై వెనక్కి తగ్గారు.

ఆ తర్వాత తన బ్లాక్‌బస్టర్ మూవీ ‘భజరంగి భాయిజాన్’ నుంచి సగం తీసి ‘భాయిజాన్’ అనే టైటిల్ పెట్టాలని సల్మాన్ ఖాన్ అనుకున్నాడు. కొన్ని నెలల నుంచి ఈ వర్కింగ్ టైటిల్‌తోనే సినిమాను షూట్ చేస్తున్నారు. కానీ ఆ టైటిల్ రిపిటీటివ్‌గా ఉంటుందని భావించి ఇప్పుడు దాన్ని కూడా పక్కన పెట్టేశారు. చివరగా ‘కిసీ కా భాయ్.. కిసీ కా జాన్’ అనే టైటిల్‌ను ఈ చిత్రానికి ఖరారు చేశారు.

తాను బాలీవుడ్లోకి అడుగు పెట్టి 34 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సల్మాన్ ఈ టైటిల్‌తో పాటు సినిమాలో తన ఫస్ట్ లుక్‌ను కూడా లాంచ్ చేశాడు. జులపాల జుట్టుతో సల్మాన్ కొంచెం భిన్నంగా కనిపించబోతున్నాడీ సినిమాలో. టాలీవుడ్ టాప్ హీరోయిన్ పూజా హెగ్డే ఈ చిత్రంలో సల్మాన్‌కు జోడీగా నటిస్తుండగా.. మన సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ఇందులో ఓ ప్రత్యేక పాత్ర చేస్తున్నాడు. అంతే కాక జగపతిబాబు సైతం ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం. ఈ ఏడాది డిసెంబరు 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది.