లైగర్.. ఇక అక్కడ లేవడం కష్టం

పుష్ప‌, కార్తికేయ‌-2 లాంటి చిత్రాల‌కు ఉత్త‌రాదిన ప్ర‌మోష‌న్ల ప‌రంగా ఏ హ‌డావుడి లేదు. వాటికి రిలీజ్ ప్లానింగ్ సైతం స‌రిగా జ‌ర‌గ‌లేదు. ఏదో మొక్కుబ‌డిగా రిలీజ్ చేస్తున్న‌ట్లే క‌నిపించింది. కానీ ఆ చిత్రాలు మౌత్ టాక్‌తో జ‌నాల‌ను థియేట‌ర్ల‌కు రప్పించాయి. ఊహించిన విజ‌యం సాధించాయి. ఐతే విజ‌య్ దేవ‌ర‌కొండ-పూరి జ‌గ‌న్నాథ్‌ల లైగ‌ర్ మూవీని ముందు నుంచి ఒక ప్రాప‌ర్ హిందీ సినిమాలాగే తీర్చిదిద్దారు.

ప్ర‌మోష‌న్ కూడా ఉత్త‌రాదిన గ‌ట్టిగా చేశారు. అయినా స‌రే.. విడుద‌ల‌కు ముందు అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ చూస్తే ఆశాజ‌న‌కంగా అనిపించ‌లేదు. ఉత్త‌రాది పెద్ద న‌గ‌రాలు వేటిలోనూ థియేట‌ర్లు ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్‌లో క‌నిపించ‌లేదు. ఈ నేప‌థ్యంలో సినిమాకు మంచి టాక్ రావ‌డం కీల‌కంగా మారింది. మాస్ ప్రేక్ష‌కుల‌ను టార్గెట్ చేసిన సినిమా కాబ‌ట్టి మంచి టాక్ వ‌చ్చి ఉంటే సినిమా రేంజి వేరుగా ఉండేదేమో. కానీ అది జ‌ర‌గ‌లేదు.

ఇటు తెలుగులోనే కాక అటు హిందీలోనూ లైగ‌ర్‌కు పూర్తి నెగెఇవ్ రివ్యూలే వ‌చ్చాయి. హిందీ క్రిటిక్స్ అయితే 1, 1.5 రేటింగ్స్ ఇచ్చారు ఈ సినిమాకు. మౌత్ టాక్ కూడా ఏమీ బాగా లేదు. ఈ నేప‌థ్యంలో హిందీలో లైగ‌ర్ ముద్ర వేయ‌డం క‌ష్ట‌మే అనిపిస్తోంది. తొలి రోజు వ‌సూళ్లు ప‌ర్వాలేదు కానీ.. ఈ సినిమా మీద పెట్టిన‌ పెట్టుబ‌డికి, చేసిన హ‌డావుడికి త‌గ్గ‌ట్ల‌యితే  ఓపెనింగ్స్ లేవు.ఈ టాక్‌తో సినిమా ముందుకు సాగ‌డం క‌ష్ట‌మే అనిపిస్తోంది.

లైగ‌ర్ హిందీ హ‌క్కుల‌ను రూ.12 కోట్ల‌కు అమ్మారు. అక్క‌డ గ్రాస్‌లో స‌గానికి స‌గం మాత్ర‌మే షేర్ రూపంలో వ‌స్తుంది. అంటే లైగ‌ర్ రూ.20 కోట్ల‌కు పైగానే గ్రాస్ క‌లెక్ట్ చేయాలి. కానీ తొలి రోజు అందులో 15 శాతం మాత్ర‌మే రిక‌వ‌రీ జ‌రిగింది. టాక్ బాలేక‌పోవ‌డంతో వీకెండ్ మీద ఆశ‌లు త‌క్కువ‌గానే ఉన్నాయి. ఆ త‌ర్వాత అయితే సినిమా నిల‌బ‌డ‌డం చాలా క‌ష్టం అనే చెప్పాలి. ఈ నేప‌థ్యంలో విజ‌య్ పాన్ ఇండియా స‌క్సెస్ ఆశ‌లు గ‌ల్లంత‌యిన‌ట్లే. లైగ‌ర్ వ‌ల్ల ఇండియా షేక్ అవ‌డం కాదు.. ఈ సినిమాను న‌మ్ముకున్న వాళ్లే షేక్ అయ్యేలా క‌నిపిస్తోంది.