ఛార్మి వెర్సస్ మెగా ఫ్యాన్స్.. గొడవేంటి!

గురువారం రోజు లైగర్ సినిమా రిలీజైంది. పూర్తిగా నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. హీరో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్‌లను పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. సినిమా గురించి మరీ ఎక్కువ చేసి చెప్పడం విజయ్‌ టార్గెట్ అవడానికి కారణమైతే.. కెరీర్లో ఈ దశలో వచ్చిన మంచి అవకాశాన్ని వృథా  చేసుకున్నందుకు, ప్రేక్షకుల అంచనాలకు తగ్గ సినిమా తీయనందుకు పూరిని లక్ష్యంగా చేసుకుంటున్నారు.

ఇదే సమయంలో మెగా అభిమానులు మాత్రం.. విజయ్, పూరీలను వదిలేసి ఈ చిత్ర నిర్మాత ఛార్మి మీద పడ్డారు. ఆమె వేసిన ఒక పాత ట్వీట్‌ను పట్టుకుని ఉదయం నుంచి తెగ ట్రోల్ చేస్తున్నారు. ఆమెకు సరిగ్గా అయిందని కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఆ ట్వీట్లో ఏముందా అని చూస్తే.. వెటకారంగా నవ్వుతున్నట్లు ఎమోజీలు, చప్పట్లు ఉన్నాయి. మరి అలా వేసిన ట్వీట్‌కు మెగా అభిమానులు ఇప్పుడు టార్గెట్ చేయడం ఏంటి అని డౌట్ రావచ్చు. అక్కడే ఉంది ట్విస్టు.

ఛార్మి ట్వీట్ పెట్టిన డేట్.. 16 అక్టోబరు 2015. ఆ రోజే రామ్ చరణ్ సినిమా ‘బ్రూస్ లీ’ రిలీజైంది. ఆ చిత్రం పెద్ద డిజాస్టర్ కావడం తెలిసిందే. ఛార్మి ఆ సినిమా పేరు ప్రస్తావించలేదు కానీ.. అది డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో వెటకారంగానే అలా ట్వీట్ వేసిందన్నది మెగా అభిమానులు చెబుతున్న భాష్యం. ఆ రోజే ఆ ట్వీట్ మీద విరుచుకుపడ్డారు. ఛార్మి వాళ్లకేమీ బదులివ్వకుండా సైలెంటుగా ఉండిపోయింది.

ఇప్పుడు ఛార్మి నిర్మాణంలో తెరకెక్కిన ‘లైగర్’ డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో ఆ ట్వీట్‌ను బయటికి తీశారు అభిమానులు. ఇంకొకరి ఫెయిల్యూర్‌ను చూసి వెటకారపు నవ్వులు నవ్వావు.. ఇప్పుడు సమ్మగా ఉందా అంటూ ఆమెను తీవ్ర స్థాయిలో దుయ్యబడుతున్నారు. ఐతే మెగా అభిమానులు చెబుతున్నట్లు అప్పట్లో ‘బ్రూస్ లీ’ సినిమా మీద ఛార్మి ఎందుకు పంచ్ వేసింది.. దాంతో ఆమెకు ఏం సంబంధం అన్నదే అర్థం కావడం లేదు. కానీ మెగా అభిమానులైతే ఈ రోజు ఆమెకు మామూలుగా ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు.