ఆగస్టు 25.. టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ కెరీర్లో అత్యంత ముఖ్యమైన డేట్. ఐదేళ్ల కిందటే ఇదే తేదీకి అతడి సినిమా ‘అర్జున్ రెడ్డి’ రిలీజైంది. బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తూ అతణ్ని రాత్రికి రాత్రి పెద్ద స్టార్‌ను చేసింది. ఇప్పుడు మళ్లీ అదే తేదీన ఇప్పటిదాకా విజయ్ కెరీర్లో బిగ్గెస్ట్ మూవీ అయిన ‘లైగర్’ రిలీజవుతోంది. ‘ఇస్మార్ట్ శంకర్’తో హిట్ ట్రాక్ ఎక్కిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ స్వీయ నిర్మాణంలో నిర్మించిన చిత్రమిది.
బాలీవుడ్ టాప్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ ఇందులో నిర్మాణ భాగస్వామి కావడం, పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేయడం విశేషం. ‘లైగర్’ ప్రోమోలేవీ కూడా అంత గొప్పగా లేకపోయినా.. విజయ్ దేవరకొండకు బేసిగ్గా ఉన్న క్రేజ్, అతడి స్టయిల్లో చేసిన అగ్రెసివ్ ప్రమోషన్లు ఈ సినిమాకు బాగా కలిసొచ్చి ప్రి రిలీజ్ హైప్ అయితే బాగా వచ్చింది. అందుకు తగ్గట్లే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఒక రేంజిలో జరిగాయి.
ఒక పెద్ద హీరో సినిమా స్థాయిలో హైప్‌తో రిలీజవుతున్న ‘లైగర్’కు కావాల్సిందల్లా మంచి టాకే. ఓ మోస్తరు టాక్ వచ్చినా సినిమా వారాంతంలోపు బయ్యర్లను సేఫ్ జోన్లోకి తెచ్చే అవకాశాలున్నాయి. తొలి రోజు సినిమా తెలుగు రాష్ట్రాల వరకు ప్యాక్డ్ హౌసెస్‌తో నడవడం గ్యారెంటీ. వీకెండ్ వరకు ఓ మోస్తరుగానే బుకింగ్స్ నడుస్తున్నాయి. టాక్ బాగుంటే వీకెండ్ అంతా వసూళ్ల మోత గ్యారెంటీ. తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే బయట, ముఖ్యంగా హిందీలో ‘లైగర్’కు అడ్వాన్స్ బుకింగ్స్ డల్లుగానే నడిచాయి.
అక్కడ టాక్‌ను బట్టే జనాలు థియేటర్లకు కదిలేలా ఉన్నారు. కాబట్టి సినిమాకు మంచి టాక్ రావడంతో హిందీలోనే చాలా అవసరం. ఈ ఆగస్టులో ఇప్పటికే బింబిసార, సీతారామం, కార్తికేయ-2 లాంటి బ్లాక్‌బస్టర్లతో కళకళలాడుతున్న టాలీవుడ్ బాక్సాఫీస్.. ‘లైగర్’తో మరో స్థాయికి చేరుతుందని ఇండస్ట్రీ జనాలు ఆశిస్తున్నారు. మరి విజయ్-పూరి జోడీ ఏమాత్రం మెరుపులు మెరిపిస్తుందో, సినిమాకు ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.