ఔను.. ప్రభాస్ అభిమానులకు మండిపోయింది. వారి ఆగ్రహం ట్విట్టర్ హ్యాష్ ట్యాగ్ రూపంలోకి మారింది. వారి కోపానికి దర్శకుడు మారుతితో ప్రభాస్ సినిమా ఓకే చేయడం, ఆ చిత్రం గురువారమే ప్రారంభోత్సవం జరుపుకోనుందని వార్త బయటికి రావడమే. ఈ సంగతి తెలియగానే #boycottmaruthifromtfi అనే హ్యాష్ ట్యాగ్ పెట్టి మారుతిని ఒక ఆట ఆడుకుంటున్నారు. అతడి ట్రాక్ రికార్డు బయటికి తీసి, ఇలాంటి దర్శకుడితో ప్రభాస్ లాంటి పాన్ ఇండియా సూపర్ స్టార్ సినిమా చేయడమా అని మండిపడుతున్నారు.
ప్రభాస్, మారుతి కాంబినేషన్ గురించి వార్త బయటికి వచ్చిన తొలి రోజుల్లోనే అభిమానులు తమ వ్యతిరేకతను బయటపెట్టారు. ఇక మారుతి లేటెస్ట్ మూవీ పక్కా కమర్షియల్ డిజాస్టర్ కావడంతో వారి వ్యతిరేకత ఇంకా పెరిగింది. ఆ సినిమా ఫలితం చూశాక ప్రభాస్‌తో అతడి సినిమా గురించి పెద్దగా వార్తలేమీ బయటికి రాకపోవడంతో ఇది క్యాన్సిల్ అవుతుందనే అంచనాతో ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్.
కానీ ఉన్నట్లుండి ఈ ప్రాజెక్టులో కదలిక వచ్చింది. మారుతి స్క్రిప్టుకు ప్రభాస్ ఓకే చెప్పడం, ప్రారంభోత్సవానికి సన్నాహాలు జరగడంతో ప్రభాస్ అభిమానుల మీద పిడుగు పడ్డట్లయింది. అసలే సాహో, రాధేశ్యామ్ డిజాస్టర్లవడంతో రెబల్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో మునిగిపోయారు. తన రేంజికి తగని దర్శకులకు ప్రభాస్ అవకాశమిచ్చి తన క్రేజ్, మార్కెట్‌ను దెబ్బ తీసుకుంటున్నాడనే అభిప్రాయంతో ఉన్న అభిమానులకు.. మారుతి సినిమాకు తమ హీరో రెడీ అవడం అస్సలు రుచించడం లేదు.
దీంతో ఈ దర్శకుడికి వ్యతిరేకంగా హ్యాష్ ట్యాగ్ పెట్టి పెద్ద ఎత్తున ట్రెండ్ చేస్తున్నారు. ఇండియా లెవెల్లో ఇది ట్రెండ్ అవుతోంది. సినిమా ప్రారంబోత్సవానికి ముందు ఇలా జరగడం చిత్ర బృందానికి తీవ్ర ఇబ్బంది కలిగించే విషయమే. అలా అని అంతా ఓకే అయిన సినిమాను ఆపేయరు. ఐతే ప్రభాస్‌తో ఓ మంచి సినిమా తీసి తనను ఇంతగా ట్రోల్ చేస్తున్న అభిమానులు తర్వాత రిగ్రెట్ అయ్యేలా మారుతి చేస్తాడేమో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates