ఎందుకొచ్చిన సినిమా ప్రమోషన్లు?

సినిమా ప్రమోషన్ అన్నది గత కొన్నేళ్లలో ఎంత కీలకంగా మారిపోయిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇంతకుముందు సినిమా రిలీజవుతుంటే ఎక్కడున్నారో తెలియనట్లుగా ఉండే హీరోలు.. ప్రి రిలీజ్ ఈవెంట్లలో పాటు అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం, మీడియాకు ఉమ్మడిగా, వన్ టు వన్ ఇంటర్వ్యూలివ్వడం.. టీవీ ఛానెళ్లలో, యూట్యూబ్ ఛానెళ్లలో కూడా ఇంటర్వ్యూలంటూ హడావుడి చేయడం.. ఇలా చాలా తతంగమే నడుస్తోంది.

చిత్ర బృందం నుంచి వేర నటీనటులు, టెక్నీషియన్లు సైతం తమ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఈ ఒరవడికి శ్రీకారం చుట్టిందే బాలీవుడ్. అక్కడ ఆమిర్ ఖాన్ సహా స్టార్ హీరోలు ప్రమోషన్లతో హోరెత్తించడం ద్వారా సినిమాలకు హైప్ పెంచడం చూసి అందరూ వారిని అనుసరించారు. కానీ ఇప్పుడు బాలీవుడ్ దీనికి పూర్తి భిన్నమైన బాటలో పయనిస్తోంది. వాళ్లకు ప్రమోషన్లే శాపం అవుతున్నాయి. సినిమాలకు చేటు చేస్తున్నాయి.

కాళ్లకు బలపం కట్టుకుని దేశమంతా తిరిగి తిరిగి సినిమాలను ప్రమోట్ చేసినా.. వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండట్లేదు. పైగా ఈ ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలుస్తున్నపుడు యధాలాపంగా అనే ఒకటీ అరా మాటలు పట్టుకుని తీవ్ర వివాదం చేస్తుండటం, అవి సోషల్ మీడియాలో వైరల్ అయి సినిమా మీద వ్యతిరేకత పెంచుతుండడం, బాయ్‌కాట్ ట్రెండ్స్‌కు దారి తీస్తుండడం గమనార్హం.

‘లాల్ సింగ్ చడ్డా’ విడుదలకు ముందు కరీనాకపూర్ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలే దానికి ప్రతికూలం అయ్యాయి. ఆమిర్ ఈ సినిమా ప్రమోషన్ కోసం పడ్డ కష్టమీదే ఫలితాన్నివ్వలేదు. పైగా మీడియా నుంచి కఠినమైన ప్రశ్నలు ఎదుర్కొని ఇబ్బందిపడ్డాడు. ఇక ఆలియా భట్ తాజాగా కరీనా కపూర్ తరహాలో ‘సినిమా నచ్చితే చూడండి. లేదంటే చూడొద్దు’ అని కామెంట్ చేయడం దుమారం రేపుతోంది. ఇది ‘బ్రహ్మాస్త్ర’కు చేటు చేసేలా కనిపిస్తోంది.

మరోవైపు అనురాగ్ కశ్యప్-తాప్సి ప్రమోషన్లలో చేసిన వ్యాఖ్యలు ‘దోబారా’కు మైనస్ అవగా.. ‘ఏక్ విలన్-2’ రిలీజ్ టైంలో అర్జున్ కపూర్ బాయ్‌కాట్ బ్యాచ్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదం అయ్యాయి. ఈ సినిమాల పరిస్థితి ఇలా ఉంటే.. అసలు ప్రమోషన్లే లేకుండా హిందీలో రిలీజైన పుష్ప, కార్తికేయ-2 కేవలం కంటెంట్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించి భారీ విజయాన్నందుకున్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే.. ప్రమోషన్లన్నీ ఆపేసి కంటెంట్ మీద దృష్టిపెట్టి.. నేరుగా సినిమానే ప్రేక్షకులను రప్పించుకునేలా చేస్తే మంచిదన్న అభిప్రాయాలు బాలీవుడ్ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.