రాక్షసుడు-2లో అతను.. నిజమేనా?

‘ఖిలాడి’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు రమేష్ వర్మ గురించి మాట్లాడుతూ కొన్ని వ్యంగ్యాస్త్రాలు విసిరాడు హీరో రవితేజ. రమేష్‌ది మామూలు లక్కు కాదని, అతను మహర్జాతకుడని పేర్కొన్నాడు. అందుకే అతడికి కోనేరు సత్యనారాయణ లాంటి నిర్మాత దొరికాడని కూడా పేర్కొన్నాడు. నిజానికి రమేష్ వర్మ ట్రాక్ రికార్డు ప్రకారం చూస్తే దర్శకుడిగా అతడికి ఇంకా అవకాశాలు దక్కుతుండడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఒక కొరియన్ మూవీని కాపీ కొట్టి తీసిన ‘రైడ్’, తమిళ హిట్‌‌కు రీమేక్‌గా చేసిన ‘రాక్షసుడు’ మినహాయిస్తే అతడి కెరీర్లో హిట్లు లేవు.

‘రాక్షసుడు’తో తమ సంస్థకు సక్సెస్ ఇచ్చిన దగ్గర్నుంచి కోనేరు సత్యానారయణకు అతను ఆస్థాన దర్శకుడైపోయాడు. తనను నమ్మి భారీ బడ్జెట్లో ‘ఖిలాడి’ తీస్తే అది దారుణమైన ఫలితాన్నందుకుంది. ఆ సినిమాకు విడుదల ముంగిట మంచి హైప్ రావడంతో ఆ ఊపులో ఇదే సంస్థలో ‘రాక్షసుడు-2’ చిత్రాన్ని ప్రకటించారు.

వంద కోట్ల బడ్జెట్లో, భారీ తారాగణం అంటూ స్టేట్మెంట్లు ఇచ్చారు. కట్ చేస్తే ‘ఖిలాడి’ తుస్సుమనిపించింది. ఈ సినిమా వార్తల్లో లేకుండా పోయింది. కానీ తాజాగా రమేష్ వర్మ పుట్టిన రోజు సందర్భంగా మళ్లీ ‘రాక్షసుడు-2’ తిరిగి వార్తల్లో నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార కిచ్చా సుదీప్ హీరో అని, మాళవిక మోహనన్ కథానాయికగా నటిస్తుందని, ఇంకో కీలక పాత్రలో ఓ స్టార్ యాక్టర్ నటిస్తాడని మీడియాకు లీకులిచ్చారు.

కానీ సుదీప్ నుంచి అసలు ఎలాంటి సౌండ్ లేదు. దీని గురించి చిత్ర బృందం అధికారికంగానూ ప్రకటించలేదు. ఈ సినిమాకు హైప్ తెచ్చేందుకు కావాలనే మీడియాకు  లీకులిచ్చి వార్తలు రాయిస్తున్నారని.. ‘విక్రాంత్ రోణ’తో కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అందుకుని మంచి డిమాండ్లో ఉన్న సుదీప్, రమేష్ వర్మ ట్రాక్ రికార్డు చూసి అతడితో సినిమా చేసే అవకాశాలు తక్కువే అని.. అతడి వైపు నుంచి అధికారిక సమాచారం బయటికి వస్తే తప్ప ఈ వార్తల్ని నమ్మలేమని అంటున్నారు టాలీవుడ్ జనాలు.