రాజమౌళి సినిమా.. ఇది శాంపిలా?

సూపర్ స్టార్ మహేష్ బాబు విషయంలో అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకుల నుంచి కూడా ఎప్పట్నుంచో ఒక కంప్లైంట్ ఉంది. అతను పాత్రల కోసం పెద్దగా మేకోవర్లకు ప్రయత్నించడని.. ప్రతి సినిమాలోనూ ఒకే రకమైన లుక్స్‌తో కనిపిస్తుంటాడని.. ప్రతి చిత్రంలోనూ అందంగా, సుకుమారంగా కనిపిస్తూ బోర్ కొట్టించేస్తున్నాడని అంటుంటారు. ‘మహర్షి’ సినిమాలో కాలేజీ ఎపిసోడ్ కోసం, ‘సర్కారు వారి పాట’లో కొంతమేర లుక్ మార్చే ప్రయత్నం చేసినా.. అవి అంత సంతృప్తినైతే ఇవ్వలేకపోయాయి.

వేరే స్టార్ హీరోల మాదిరి మహేష్‌ను రగ్డ్ లుక్స్‌లో చూడాలన్నది అభిమానుల ఆకాంక్ష. మహేష్ ఇలా ఎందుకు చేయలేడంటూ యాంటీ ఫ్యాన్స్ చేసే ట్రోలింగ్‌కు సరైన సమాధానం చెప్పాలని వాళ్లు ఎప్పట్నుంచో కోరుకుంటున్నారు. సుకుమార్‌తో సినిమా చేస్తే ఆ అవకాశం ఉండేదమో కానీ.. ఆ చిత్రం క్యాన్సిలవడంతో ఛాన్స్ లేకుండా పోయింది. ఐతే ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా కోసం సూపర్ స్టార్‌ మేకోవర్ ట్రై చేస్తున్నట్లే కనిపిస్తోంది.

కొన్ని రోజులుగా వెకేషన్లో ఉన్న మహేష్ అక్కడ నుంచి లీక్ చేస్తున్న ఫొటోలు చూస్తుంటే గడ్డం పెంచి రఫ్ లుక్‌లోకి మారేలాగే కనిపిస్తున్నాడు. ఐతే కేవలం హేర్ స్టైల్, గడ్డం మారితే సరిపోదు కదా? బాడీ మొత్తం ఛేంజ్ కనిపించాలి. అందుకే ‘1 నేనొక్కడినే’ టైంలో మాదిరి కండలు కూడా పెంచేలా ఉన్నాడు. చిజిల్డ్ బాడీ కోసం ప్రయత్నిస్తున్నట్లున్నాడు. తాజాగా సోషల్ మీడియాలో తిరుగుతున్న ఫొటోలు చూస్తే అదే అనిపిస్తోంది. త్రివిక్రమ్ సినిమాలో మహేూష్ మామూలుగా అయితే కనిపించడన్నది స్పష్టం. ఐతే మహేష్ మరీ ఎక్కువ గడ్డం పెంచినా సెట్ కాదేమో అన్న సందేహాలు కూడా లేకపోలేదు.

మరి ఎలా మేనేజ్ చేస్తారో చూడాలి. నిజానికి ఈ సినిమాకు కాకపోయినా రాజమౌళి చిత్రం కోసమైతే మహేష్ పూర్తిగా లుక్ మార్చాల్సిందే. ఆయన సినిమాల్లో హీరో సుకుమారంగా కనిపిస్తే కుదరదు. రాజమౌళి ప్రతి హీరో కూడా బాగా కష్టపడి షాకింగ్ లుక్‌లోకి మారుతుంటాడు. మహేష్‌ను కూడా ఆయన వదలకపోవచ్చు. ఐతే ఒకేసారి ఆ సినిమాకు కష్టపడ్డం కంటే, పూర్తిగా లుక్ మార్చేయడం కంటే.. త్రివిక్రమ్ సినిమాను సన్నాహం లాగా ఉపయోగించుకుందామని మహేష్ భావిస్తుండొచ్చు. ప్రేక్షకులను కూడా తన రఫ్ లుక్‌కు ప్రిపేర్ చేయడానికి దీన్ని శాంపిల్ లాగా భావిస్తుండొచ్చు.