క‌న్నీళ్లు పెట్టుకున్న ఛార్మి

13-14 ఏళ్ల వ‌య‌సులోని క‌థానాయిక‌గా అరంగేట్రం చేసి దాదాపు ద‌శాబ్దంన్న‌ర పాటు టాలీవుడ్లో పేరున్న హీరోయిన్ల‌లో ఒక‌రిగా కొన‌సాగింది ఛార్మి. ఐతే క‌థానాయిక‌గా కెరీర్ ముగుస్తున్న త‌రుణంలో ఆమెకు పూరి జ‌గ‌న్నాథ్‌తో స్నేహం కుదిరి ఆయ‌న సినిమాల ప్రొడ‌క్ష‌న్ వ్య‌వ‌హారాలు చూడ‌డం మొద‌లుపెట్టింది. ఇప్ప‌టికే పూరి సినిమాలు చాలా వాటికి ప్రొడ‌క్ష‌న్లో ప‌ని చేసిన ఛార్మి.. ఇప్పుడు లైగ‌ర్ లాంటి భారీ మూవీతో నిర్మాత‌గా త‌న కెరీర్‌ను మ‌రో స్థాయికి తీసుకెళ్తోంది.

ఈ సినిమాను పూర్తి చేసి విడుద‌ల చేయ‌డానికి ఛార్మి ఎంత క‌ష్ట‌ప‌డిందో పూరి ఇప్ప‌టికే ప్ర‌మోష‌నల్ ఈవెంట్ల‌లో చెప్పాడు. ఈ చిత్రం ఈ నెల 25న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న నేప‌థ్యంలో పూరి, విజ‌య్ దేవ‌ర‌కొండ‌ల‌ను ఛార్మి ఇంట‌ర్వ్యూలో చేయ‌డం విశేషం. ఈ ఇంట‌ర్వ్యూ చివ‌ర్లో ఛార్మి చాలా ఎమోష‌న‌ల్ అవుతూ క‌న్నీళ్లు పెట్టుకోవ‌డం గ‌మ‌నార్హం. 

ఈ సినిమా కోసం ఎదుర్కొన్న స‌వాళ్ల‌ను గుర్తు చేసుకుంటూ ఆమె ఉద్వేగానికి గురైంది. 2019 ఆగ‌స్టులో విజ‌య్‌కి లైగ‌ర్ క‌థ చెప్పామ‌ని, సినిమా ఓకే అయ్యాక క‌రోనా వ‌చ్చింద‌ని, దాంతో పాటే ప‌లుమార్లు లాక్‌డౌన్ కూడా వ‌చ్చింద‌ని.. దీంతో సినిమాకు ఆర్థికంగా ఇబ్బందులు త‌ప్ప‌లేద‌ని ఛార్మి వెల్ల‌డించింది.

ఒక ద‌శ‌లో త‌మ జేబుల్లో ఒక్క రూపాయి లేద‌ని, అలాంటి టైంలో ఓటీటీ నుంచి డైరెక్ట్ డిజిట‌ల్ రిలీజ్ కోసం పెద్ద ఆఫ‌ర్ వచ్చింద‌ని ఛార్మి చెప్పింది. ఆ ఆఫ‌ర్ చూసి వేరే వాళ్ల‌యితే టెంప్ట్ అయ్యేవాళ్ల‌ని, కానీ దాన్ని రిజెక్ట్ చేసే ద‌మ్ము పూరి జ‌గ‌న్నాథ్‌కు మాత్ర‌మే ఉంద‌ని, ఇది థియేట‌ర్ ఫిలిం అన్న ఉద్దేశంతో ఓటీటీ ఆఫ‌ర్ తిర‌స్క‌రించార‌ని ఛార్మి చెప్పింది. ఎంతో దృఢ సంక‌ల్పం ఉన్న పూరి కూడా ఈ సినిమా జ‌ర్నీలో కొన్నిసార్లు నిరాశ‌కు గుర‌య్యాడ‌ని.. కానీ ఆయ‌న్ని ముందుకు న‌డిపించింది విజ‌య్ దేవ‌ర‌కొండ‌, సినిమాలోని కంటెంట్ మాత్ర‌మే అని చెబుతూ ఛార్మి క‌న్నీళ్లు పెట్టేసుకుంది.