తెలుగు సినీ చరిత్ర మొత్తంలో కమెడియన్గా బ్రహ్మానందం అందుకున్న స్థాయి అనితర సాధ్యమైనది. స్టార్ హీరోలతో సమానంగా ఇమేజ్ సంపాదించాడాయన. తెరపై హీరోలు కనిపించినప్పటి కంటే బ్రహ్మానందం కనిపిస్తేనే థియేటర్లు ఎక్కువగా హోరెత్తే స్థాయిలో ఆయన ఒకప్పుడు క్రేజ్ సంపాదించారు.
ఒకప్పుడు బ్రహ్మి లేకుండా ఏ పెద్ద సినిమా ఉండేది కాదు. ఆయన కామెడీతోనే ఎన్నో సినిమాలు బ్లాక్బస్టర్లయ్యాయంటే అతిశయోక్తి కాదు. కాకపోతే ఎంతటి వాళ్లకైనా ఏదో ఒక సమయంలో క్రేజ్ తగ్గి అవకాశాలు ఆగిపోవడం సహజం. బ్రహ్మానందం కూడా అందుకు మినహాయింపు కాలేకపోయారు. వరుసగా ఆయన క్యారెక్టర్లు ఫెయిలవడం.. కామెడీ పండకపోవడం.. అవకాశాలు తగ్గిపోవడం.. ఇలా చూస్తుండగానే కథ మొత్తం మారిపోయింది. ఒకప్పుడు ఏదైనా పెద్ద సినిమాలో బ్రహ్మి లేకపోతే ఆశ్చర్యపోయేవాళ్లం. కానీ ఇప్పుడు ఆయన ఏదైనా సినిమాలో ఉంటే ఆశ్చర్యం కలుగుతోంది.
చివరగా ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో రాములో రాములా పాటలో తళుక్కుమన్న బ్రహ్మి.. ఆ తర్వాత కనిపించలేదు. ఇకపై ఏ తెలుగు సినిమాలోనూ బ్రహ్మి కనిపించబోరని నిన్నట్నుంచి జోరుగా ప్రచారం జరుగుతుండటం గమనార్హం. బ్రహ్మి తనకు తానుగా ఇక సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారట. గత ఏడాదే బ్రహ్మి హార్ట్ సర్జరీ చేయించుకున్నారు. ఇప్పుడాయన ఎక్కువ శ్రమ తీసుకునే పరిస్థితుల్లో లేరు. ఎవరినీ అవకాశాల కోసం అడిగే స్థాయి కాదు ఆయనది.
రచయితలు, దర్శకులు కూడా బ్రహ్మిని దృష్టిలో ఉంచుకుని పాత్రలు డిజైన్ చేయడం ఆపేశారు. ఈ నేపథ్యంలో గౌరవప్రదంగా తనే సినిమాల నుంచి తప్పుకోవాలని బ్రహ్మి నిర్ణయించుకున్నారట. ఐతే ఆయన టీవీలో మాత్రం ఓ ప్రత్యేక కార్యక్రమం ద్వారా అలరించబోతున్నట్లు చెప్పుకుంటున్నారు. త్వరలోనే దాని గురించి ప్రకటన ఉంటుందట. ఐతే ఇకపై బ్రహ్మి నటించరేమో కానీ.. ఆల్రెడీ ఆయన కృష్ణవంశీ చిత్రం ‘రంగమార్తాండ’లో ఓ సీరియస్ పాత్ర చేశారు. బహుశా అదే ఆయన చివరి చిత్రం అవుతుందేమో.
Gulte Telugu Telugu Political and Movie News Updates