ఆమిర్ ఖాన్ అస్త్ర సన్యాసం?

బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాభవాన్ని ఎదుర్కొంటున్నాడు. ఒకప్పుడు అలవోకగా వందల కోట్ల వసూళ్లు రాబట్టిన అతను.. ఇప్పుడు ‘లాల్ సింగ్ చడ్డా’తో 50 కోట్ల వసూళ్ల మార్కును అందుకోవడానికి కూడా కష్టపడుతున్నాడు. తొలి రోజు రూ.12 కోట్లు మాత్రమే ఈ చిత్రం వసూలు చేయగా.. ఆ తర్వాత ఇంకా ఇంకా వసూళ్లు పడుతున్నాయి.

ఈ సినిమా మీద రకరకాల కారణాల వల్ల నెలకొన్న నెగెటివిటీ వల్ల విడుదలకు ముందే ఇది డిజాస్టర్ అన్న సంకేతాలు కనిపించాయి. దీనికి తోడు బ్యాడ్ టాక్ రావడంతో పరిస్థితి దయనీయంగా తయారైంది. తొలి రోజు ఈ చిత్రానికి జనాలు లేక 1300 షోలు క్యాన్సిల్ చేయాల్సి వచ్చిందంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు ఇలాంటి క్లాస్ సినిమాలతోనే ఆమిర్ వసూళ్ల మోత మోగించేవాడు. ఇప్పుడు అతడి మీద ఒక వర్గంలో వ్యతిరేక అభిప్రాయం నెలకొని తన సినిమాలపై ప్రతికూల ప్రభావం పడుతోంది.

‘లాల్ సింగ్ చడ్డా’ విడుదలకు ముందు తనకు కొన్ని రోజుల పాటు నిద్ర రాలేదని.. ఈ సినిమా ఫలితం ఏమవుతుందో అని టెన్షన్‌గా ఉందని ఆమిర్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఇప్పుడు అతడి భయం నిజమైంది. రూ.200 కోట్లు పెట్టి తీసిన సినిమాకు అందులో నాలుగో వంతు కూడా థియేటర్ల నుంచి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ చిత్రంలో ఆమిర్ నిర్మాణ భాగస్వామి కూడా కావడం గమనార్హం. దీంతో అతడి మీద పెద్ద భారమే పడబోతోంది.

తన సినిమాను ఒక వర్గం ఇంతగా టార్గెట్ చేయడం, విపరీతమైన నెగెటివిటీని స్ప్రెడ్ చేయడం, ఎంతో కష్టపడి చేసిన సినిమాకు ఇలాంటి ఫలితం రావడం పట్ల ఆమిర్ బాగా హర్టయినట్లు సమాచారం. అతను ఈ పరిస్థితుల్లో ఇంకో సినిమా గురించి ఆలోచించేలా కూడా లేడట. మామూలుగానే బాలీవుడ్ పరిస్థితి బాగా లేకపోవడం, తన శైలి సినిమాలకు ఇప్పుడు సరైన స్పందన కనిపించకపోవడం, దీనికి తోడు అనవసర నెగిటివిటీ.. ఇవన్నీ చూసి ఆమిర్ ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్లిపోయాడని.. ఇప్పుడిప్పుడే కొత్త సినిమా చేయకపోవచ్చని.. అతను బ్రేక్ తీసుకోబోతున్నాడని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.