టైం పాయె.. డబ్బులు పాయె..

ఆమిర్ ఖాన్ సినిమా కోసం ఎంత కష్టపడతాడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. దాన్నో మహా యజ్ఞం లాగా చేస్తాడతను. మిగతా హీరోల్లాగా ఒక సినిమాకు డేట్లు ఇచ్చామా.. వెళ్లి నటించి వచ్చేశామా.. ఇంకో మీద దృష్టి పెట్టామా అన్నట్లు ఉండదు అతడి వ్యవహారం. స్క్రిప్టు దశ నుంచి సినిమా రిలీజ్ అయి థియేటర్లలోంచి వెళ్లిపోయే వరకు ప్రతి దశలోనూ అతడి ప్రమేయం ఉంటుంది. దర్శకులు, రచయితలతో స్క్రిప్టు చర్చల్లో పాల్గొంటాడు. వర్క్ షాప్స్‌ చేయిస్తాడు. మేకింగ్‌లో అన్నీ దగ్గరుండి చూసుకుంటాడు.

ఇక ప్రమోషన్ల విషయంలోనూ బాగా ఇన్వాల్వ్ అవుతాడు. బిజినెస్, రిలీజ్ వ్యవహారాలను కూడా పర్యవేక్షిస్తాడు. అతడి సినిమాల మేకింగ్ కూడా నెమ్మదిగా, సుదీర్ఘంగా సాగుతుంది. అందుకే ఒక్కో సినిమాకు ఆమిర్ రెండు మూడేళ్లు సమయం తీసుకుంటాడు. కరోనా పుణ్యమా అని ‘లాల్ సింగ్ చడ్డా’ ఇంకా ఎక్కువ సమయమే పట్టింది. హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం కోసం ఆమిర్ ఎంత శ్రమించాడో అందరికీ తెలుసు. ఈ చిత్రానికి ఆమిర్ నిర్మాత కూడా.

సినిమాను లావిష్‌గా తీయడం.. కరోనా కారణంగా వర్కింగ్ డేస్ పెరగడం, వడ్డీల భారం పెరగడంతో బడ్జెట్ తడిసి మోపెడై రూ.200 కోట్లకు చేరుకుంది. మామూలుగా అయితే ఆమిర్ సినిమాలకు ఈ బడ్జెట్ రికవరీ పెద్ద కష్టమేమీ కాదు. కానీ ‘లాల్ సింగ్ చడ్డా’కు ప్రి రిలీజ్ హైప్ లేకపోవడం ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపింది. ఇక రిలీజ్ రోజు బ్యాడ్ టాక్ రావడంతో థియేటర్లు వెలవెలబోయాయి. ఇన్నేళ్ల ఆమిర్ కెరీర్లో ఏ సినిమాకూ లేనంత దారుణమైన పరిస్థితి ఈ చిత్ర థియేటర్లలో కనిపిస్తోంది.

వీకెండ్లోనే సినిమా వాషౌట్ అయిపోయే పరిస్థితి కనిపిస్తోంది. థియేటర్ల నుంచి ఈ సినిమాకు వచ్చే ఆదాయం రిలీజ్, మెయింటైనెన్స్ ఖర్చులకే సరిపోయేలా ఉంది. ఓటీటీ రిలీజ్ కూడా ఆర్నెల్ల తర్వాత ఉండేలా డీల్ చేసుకోవడంతో అక్కడి నుంచి వచ్చే ఆదాయం కూడా తక్కువే. కాబట్టి ‘లాల్ సింగ్ చడ్డా’ పుణ్యమా అని ఆమిర్ తన కెరీర్లో అత్యంత విలువైన నాలుగేళ్ల సమయాన్ని కోల్పోవడమే కాదు. భారీ నష్టం కూడా మూటగట్టుకోబోతున్నాడు. ఎనిమిదేళ్ల ముందు ‘దంగల్’ ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన హీరోకు ఇప్పుడు ఈ పరిస్థితి వస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు.