సీతారామం-2 ఉంది.. కానీ

తెలుగులో సీక్వెల్స్ అచ్చి రాకున్నా సరే.. ఒక సినిమా పెద్ద హిట్టవగానే దాని సీక్వెల్ గురించి చర్చ మొదలైపోతుంది. ఆ కథను కొనసాగించే స్కోప్ ఉందా లేదా అని చూడకుండా.. సీక్వెల్ గురించి మాట్లాడేస్తారు జనాలు. హీరో చనిపోయే ‘సీతారామం’ సినిమాకు సైతం సీక్వెల్ ఉంటే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చేసింది మీడియా వాళ్లకు. ఈ చిత్ర సక్సెస్ మీట్లో దర్శకుడు హను రాఘవపూడికి ఇదే ప్రశ్న ఎదురైంది.

అందుకతను ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. సీతారామం-2 ఉంటుంది కానీ.. అది సీక్వెల్ కాదని చెప్పాడు. ఈ కథను కొనసాగించడానికి అవకాశం లేదని తేల్చేశాడు. ఐతే ఇక్కడ సీతారామం-2 అనడంలో ఉద్దేశం వేరు. ఈ చిత్రంలో సీత, రామ్ పాత్రలు పోషించిన మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్‌ల కలయికలో తాను ఇంకో సినిమా తీస్తానని చెప్పాడు.

‘సీతారామం’ సినిమాతో ప్రేక్షకులు అంత ఎమోషనల్‌గా కనెక్ట్ కావడానికి దుల్కర్, మృణాల్‌లే కారణమని.. వాళ్లిద్దరూ అంత బాగా నటించారని హను తెలిపాడు. అందుకే ఈ జోడీతో మరో సినిమా చేయాలనుకుంటున్నట్లు అతను తెలిపాడు. టాలీవుడ్లో చాలామంది యంగ్ హీరోలుండగా.. రామ్ పాత్రకు దుల్కర్‌నే ఎందుకు ఎంచుకున్నారని అడిగితే.. అతను మాత్రమే చేయగలిగే రోల్ ఇదని నమ్మడం వల్ల తనతో ఈ సినిమా చేసినట్లు తెలిపాడు హను. మరోవైపు దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. తన కెరీర్ మొత్తంలో ‘ది బెస్ట్’ అని చెప్పుకోదగ్గ పాత్రల్లో ‘సీతారామం’లో చేసిన రామ్ పాత్ర ఒకటని అభిప్రాయపడ్డాడు.

తెలుగు అనే కాకుండా అన్ని భాషల్లో ‘సీతారామం’ సినిమాకు అద్భుతమైన స్పందన వస్తోందని.. మృణాల్ చేసిన సీతామహాలక్ష్మి పాత్రతో అందరూ ప్రేమలో పడిపోతున్నారని.. ఆ పాత్ర కోసమే మళ్లీ మళ్లీ థియేటర్లకు వస్తున్నారని.. ఆమె లేకపోతే ‘సీతారామం’ సినిమా లేదని అన్నాడు. ‘వైజయంతీ మూవీస్’ లాంటి ప్రొడక్షన్ హౌస్‌ను తాను ఇంత వరకు చూడలేదని.. సంస్థలో అందరూ ఒక కుటుంబంలా ఉంటారని.. ఈ బేనర్లో ఎప్పుడు సినిమా చేయమన్నా రెడీ అని చెప్పాడు దుల్కర్.