నాన్నే నువ్వు నటించలేవు అన్నారు: దుల్కర్

ఒక పెద్ద స్టార్ హీరోకు కొడుకు పుడితే ఆటోమేటిగ్గా అతను హీరో అయిపోతాడు. చిన్నతనం నుంచే హీరోను చేయాలన్న ఉద్దేశంతో ఆ దిశగా ట్రైన్ చేయడం జరుగుతుంది. యుక్త వయసు వచ్చాక ఫిలిం స్కూల్స్‌కు పంపడం, ప్రత్యేకంగా మాస్టర్లను పెట్టి నటనతో పాటు డ్యాన్సులు, ఫైట్లలో శిక్షణ ఇప్పించడం జరుగుతుంది. ఐతే మలయాళ సూపర్ స్టార్లలో ఒకడైన మమ్ముట్టి మాత్రం తన కొడుకు దుల్కర్ సల్మాన్‌ను సినిమాల్లోకి తీసుకు రావాలని అనుకోలేదట.

ఈ విషయంలో ఆయన చాలా బలంగా నిర్ణయం తీసుకున్నారట. అంతే కాక కొడుకును దుబాయ్‌కి పంపించి అక్కడే ఉద్యోగం కూడా చేయించాడు. ఐతే దుల్కర్‌కు సినిమాల మీద ఆసక్తి కలిగి ఇటు వైపు అడుగులు వేస్తానంటే మమ్ముట్టి చాలా బాధ పడడమే కాక.. అందుకో నో అంటే నో అని చెప్పేశాడట. కానీ అందుకు తాను చిన్నతనం నుంచి వ్యవహరించిన తీరే కారణమని దుల్కర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

‘‘డిగ్రీ పూర్తి చేశాక యుఎఎస్ లోని ఓ యూనివర్శిటీలో ఎంబీఏ చదివా. తర్వాత దుబాయ్‌లో ఉద్యోగం చేశా. కానీ 9-5 ఉద్యోగం నాకు బోర్ కొట్టేసింది. అప్పుడే సినిమాల్లోకి వెళ్తామని అనిపించి ఉద్యోగం మానేసి కేరళకు వచ్చా. ఉద్యోగం మానేసినందుకు, సినిమాల్లోకి వస్తానన్నందుకు నాన్న చాలా బాధ పడ్డారు. వద్దే వద్దన్నారు. ‘నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు నటించలేవు. నువ్వు సరదాగా డ్యాన్స్ చేయడం ఇంట్లో నేనెప్పడూ చూడలేదు. వారసుడిగా పరిచయం చేయగలను కానీ.. నువ్వు నటించకపోతే దారుణమైన విమర్శలు వస్తాయి. అవి విని తట్టుకోలేను’ అన్నారు.

నాన్న అలా అనడానికి కారణముంది. నేను నటనను ఎప్పుడూ ఒక ఛాయిస్ లాగా అనుకోలేదు. హైస్కూల్లో ఉన్నపుడు నాకు చాలా సిగ్గు. క్లాస్‌లో బాగా అల్లరి చేసేవాడిని తప్ప స్టేజ్ ఎక్కాలంటే వణికిపోయేవాడిని. కల్చరల్ యాక్టివిటీస్‌లో అస్సలు పాల్గొనేవాడిని కాదు. అందుకే నాన్న నన్ను సినిమాల్లోకి వద్దన్నారు. కానీ కొన్నాళ్లు ముంబయిలో యాక్టింగ్ కోర్సు చేసి నాన్నను ఒప్పించి సినిమాల్లోకి వచ్చా. ‘ఉస్తాద్ హోటల్’ నాకు మంచి పేరు తేవడంతో వెనుదిరిగి చూసుకోలేదు’’ అని దుల్కర్ వెల్లడించాడు.