గత ఏడాది మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల సందర్భంగా జరిగిన రచ్చ గురించి తెలిసిందే. ఆ సందర్భంగా ప్రధానంగా చర్చకు వచ్చిన విషయం ‘మా’ శాశ్వత భవన నిర్మాణం. ఇంత పెద్ద ఇండస్ట్రీలో ఆర్టిస్టుల కోసం ఒక శాశ్వత భవనం లేకపోవడం పట్ల చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గతంలో ఉన్న భవనాన్ని అమ్మేయడం.. తర్వాత ‘మా’ను నడిపించిన ఎవ్వరూ కూడా భవన నిర్మాణం విషయంలో అనుకున్నంత చొరవ చూపించకపోవడం మీద చాలా చర్చ జరిగింది.
ఐతే ఈసారి ‘మా’ అధ్యక్ష పదవికి పోటీ పడ్డ మంచు విష్ణు, ప్రకాష్ రాజ్‌లిద్దరూ కూడా ఈ బాధ్యత తాము తీసుకుంటామని హామీ ఇచ్చారు. విష్ణు అయితే తాను ఆల్రెడీ ‘మా’ భవనం కోసం స్థలాలు చూసేశానని, తాను అధ్యక్షుడు అయితే సొంత డబ్బులు పెట్టి బిల్డింగ్ కడతానని కూడా ఘనంగా ప్రకటన చేశాడు. కానీ ఎన్నికల్లో గెలిచి పది నెలలు కావస్తున్నా ఇంకా ఆ దిశగా అడుగే ముందుకు పడలేదు. ఈ నేపథ్యంలో ఒకప్పుడు ‘మా’లో కీలకంగా ఉండడమే కాక, అధ్యక్ష పదవికి కూడా పోటీ పడ్డ సీనియర్ నటి జయసుధ ‘మా’ భవన నిర్మాణం గురించి ఓ ఇంటర్వ్యూలో ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఈసారి ‘మా’ ఎన్నికల గొడవ తనకు అసహ్యం కలిగించినట్లుగా మాట్లాడిన ఆమె.. ఈ గొడవ చూడలేక తాను యుఎస్‌లో ఒక నెల అదనంగా ఉండిపోయినట్లు చెప్పారు. ఒక వయసుకు వచ్చాక ఇంకొకరికి స్ఫూర్తిగా ఉండాల్సింది పోయి ‘మా’ ఎన్నికల సందర్భంగా ఒకరితో ఒకరు అంతగా గొడవ పడడం తనకు నచ్చలేదని ఆమె చెప్పారు. ‘మా కుటుంబం’ అన్న వాళ్లు అందులో సభ్యుల గురించి బహిరంగంగా మాట్లాడడం సరి కాదని ఆమె అన్నారు.
‘మా’ బిల్డింగ్ గురించి మురళీ మోహన్ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి చెబుతున్నారని.. కానీ 50 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్న తాను, నటిగా 75వ వసంతంలోకి అడుగు పెట్టినప్పటికైనా ఈ భవనం పూర్తవుతుందో లేదో తనకు తెలియదని జయసుధ అన్నారు. ఇండస్ట్రీలోని వాళ్లంతా తమ సంపాదనలో ఒక్క శాతం ఇచ్చినా ఆ భవనం సిద్ధం అవుతుందని.. కానీ అది ఎందుకు జరగట్లేదో అర్థం కావట్లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates