ఫ్లాప్ అయితే ద్వేషమంటారా

అదేంటో బాలీవుడ్ జనాలు మరీ సున్నితంగా మారిపోతున్నారు. ఒక సినిమాని ప్రేక్షకులు తిరస్కరిస్తే దానికి కారణాలు ఏంటని విశ్లేషించుకోకుండా కొత్త అర్థాలు తీసి నయా ట్రెండ్ కి శ్రీకారం చుడుతున్నారు. ఇటీవలే విడుదలైన షంషేరా బాక్సాఫీస్ వద్ద ఎంత దారుణంగా బోల్తా కొట్టిందో చూశాం. కేవలం మూడో రోజుకే జనం లేక షోలు క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. నూటా యాభై కోట్లకు పైగా బడ్జెట్ తో యష్ రాజ్ లాంటి సుప్రసిద్ధ సంస్థ తీసిన ఈ విజువల్ గ్రాండియర్ కు ఇంత దారుణ పరాభవం ఊహించనిది.

సరే జరిగిందేదో జరిగింది ఇలాంటి వస్తుంటాయి పోతుంటాయని వదిలేయకుండా దర్శకుడు కరణ్ మల్హోత్రా, ఇందులో విలన్ గా సంజయ్ దత్ కు ఈ పరాజయానికి వెరైటీ భాష్యం చెబుతున్నారు. కొందరు అకారణంగా షంషేరా మీద ద్వేషం పెంచుకున్నారని, చూడని వాళ్ళు సైతం నెగటివిటీ పంచడానికి పూనుకున్నారని, మేము పడ్డ కష్టాన్ని గుర్తించకుండా ఇంత విషాన్ని చిమ్మడం బాధ కలిగించిందని ట్విట్టర్ వేదికగా చాంతాడంత మెసేజులు పెట్టారు. దీనికి సానుభూతి రాకపోగా నెటిజెన్లు రివర్స్ కౌంటర్లు ఇవ్వడం అసలు ట్విస్ట్.

తీసిందే నాసిరకరం కంటెంట్. దాన్ని నిజాయితీగా ఒప్పేసుకుని మరోసారి ఇలా చేయమంటే సరిపోయేదానికి ద్వేషం లాంటి పెద్ద పదాలు వాడటం ఏమిటో అంతు చిక్కడం లేదు. హృతిక్ రోషన్ తో అగ్నిపథ్ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ నుంచి ఇలాంటి అవుట్ ఫుట్ ని ఎవరు ఆశిస్తారు. సహజంగానే అసంతృప్తి కొంత ఎక్కువ మోతాదులో బయటికి వచ్చింది. సంజయ్ దత్ చేసిన ఓవరాక్షనే షంషేరా ప్రధాన మైనస్సులో ఒకటిగా ఉంది. అయినా ఇలా చేయడం ద్వారా సింపతీ రావడం ఏమో కానీ ఉన్న పరపతి పోయేలా ఉంది .