సాహో, రాధేశ్యామ్ చిత్రాలతో తీవ్రంగా నిరాశ పరిచాడు ప్రభాస్. ఐతే ఇప్పుడు అతడి చేతిలో ఉన్న సినిమాల మీద భారీ ఆశలు, అంచనాలు ఉన్నాయి. అవన్నీ భారీ స్థాయి చిత్రాలే. అందుకే విడుదల విషయంలో సుదీర్ఘ నిరీక్షణ తప్పట్లేదు. ప్రభాస్ తర్వాతి రిలీజ్ ఆదిపురుష్ అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణకు మరీ ఎక్కువ సమయమేమీ పట్టలేదు. గత ఏడాదే షూటింగ్ ముగించేశారు.
మేకింగ్ కోసం ఏడాది కూడా సమయం పట్టలేదు. కానీ పోస్ట ప్రొడక్షన్ పని చాలా ఉండడంతో బాగా టైం తీసుకుంటున్నారు. షూటింగ్ అయ్యాక ఏడాదికి పైగా విరామం తర్వాత సినిమా రిలీజవుతుండటాన్ని బట్టి పోస్ట్ ప్రొడక్షన్ ఎంత పెద్ద స్థాయిలో జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్‌కు అంత ప్రాధాన్యం ఉంది ఆ చిత్రంలో. ప్రభాస్ నటిస్తున్న మరో కొత్త చిత్రం ప్రాజెక్ట్-కె కూడా ఇందుకు భిన్నంగా ఏమీ అనిపించడం లేదు.
ప్రాజెక్ట్-కె రిలీజ్ విషయంలో తాజాగా నిర్మాత అశ్వినీదత్ మీడియాకు క్లారిటీ ఇచ్చేశారు. ఈ సినిమా వచ్చే ఏడాది అక్టోబరు 18న దసరా కానుకగా కానీ.. లేదంటే 2024 సంక్రాంతికి కానీ రిలీజవుతుందని ఆయన వెల్లడించారు. ఐతే ప్రాజెక్ట్-కె షూటింగ్ మాత్రం 2023 జనవరికే పూర్తయిపోతుందట. ఇది హాలీవుడ్ ఎవెంజర్స్ తరహా ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్ టచ్ ఉన్న సినిమా. విజువల్ ఎఫెక్స్ట్ ప్రపంచ స్థాయిలోనే ఉండబోతున్నాయి. ఈ సినిమాతో ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తామని.. ఇది పాన్ వరల్డ్ సినిమా అని దర్శకుడు నాగ్ అశ్విన్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
బడ్జెట్ కూడా రూ.500 కోట్లని అంటున్నారు. అందులో మెజారిటీ ఎఫెక్ట్స్ కోసమే పెట్టనున్నారు. హాలీవుడ్ టెక్నీషియన్లు అందుకోసం పని చేయనున్నారు. వచ్చే జనవరి నుంచి 10-12 నెలలు పోస్ట్ ప్రొడక్షన్ కోసం కేటాయించబోతున్నారన్నమాట. కుదిరితే 2023 అక్టోబరులో అన్నారు కానీ.. 2024 జనవరిలోనే ఈ సినిమా వచ్చే అవకాశాలు ఎక్కువ.